ధర్మ విజయం: చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రాజాసింగ్, నేరుగా ఇంటికి, సంబరాలు
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. వివాదాస్ప వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజా సింగ్ కు బుధవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టును కూడా హైకోర్టు ఎత్తివేసింది.
హైకోర్టు షరతులతో నేరుగా ఇంటికి చేరుకున్న రాజా సింగ్
ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతులు విధించడంతో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి చేరుకున్నారు.
రాజా సింగ్ అభిమానులు, బీజేపీ శ్రేణుల సంబరాలు
ఎమ్మెల్యే రాజా సింగ్ పై హైకోర్టు పీడీయాక్టును ఎత్తివేయడంతో బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుని టపాసులు కాల్చారు. నృత్యాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. స్వీట్లూ పంచుతూ ఆనందం పంచుకున్నారు.
ధర్మ విజయమంటూ రాజా సింగ్
బెయిల్ మంజూరు చేయడంతోపాటు పీడీయాక్టును ఎత్తివేయడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ధర్మం గెలిచిందంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. మరోసారి మీ సేవకు పాత్రుడ్ని కాబోతున్నానని చెప్పారు. శ్రీరాముడు విగ్రహంతో దిగిన ఫొటోను జైశ్రీరాం అంటూ రాజా సింగ్ పంచుకున్నారు.
బెయిల్ మంజూరు చేస్తూ షరతలు విధించిన కోర్టు
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, పలు షరతులు విధించింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రాజా సింగ్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులకుపైగా జైలులో ఉన్న రాజా సింగ్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మీడియాతో కూడా మాట్లాడవద్దని, ఎలాంటి ర్యాలీలు కూడా చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇతర మతాలపై వ్యాఖ్యలు చేయొద్దని తేల్చి చెప్పింది. అంతేగాక, రాజా సింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్టును కూడా ఎత్తివేసింది.












Click it and Unblock the Notifications