Raja Singh: మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొంటే చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్ లో వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటారు. గల్లీ.. గల్లీకి గణనాథుడిని ప్రతిష్టిస్తుంటారు. ఇక నిమజ్జనం మామూలుగా ఉండదు. లారీల్లో వినాయక విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. తీన్మార్ డ్యాన్స్ లతో గణపయ్యకు వీడ్కోలు పలుకుతారు. అయితే నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి వేడుకల్లో పాల్గొంటారు. కొందరు దేవుడిపై భక్తితో కాకుండా ఎంజాయ్ కోసం వినాయక నిమజ్జనంలో పాల్గొంటారు.
ఇలాంటి వారిపైనే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మద్యం సేవించి వినాయక నిమజ్జనానికి వెళ్తున్నారని.. వారి చర్యల తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను కోరారు. సీపీకి ఓ లేఖ కూడా రాశారు. గత సంవత్సరం నిమజ్జనం సందర్భంగా కొంత మంది మద్యం తాగి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. కొంత మంది బుద్దిలేని వాళ్లు గణేష్ విగ్రహం వద్ద బీర్, మద్యం తాగుతూ తినిపించారని వివరించారు.

మద్యం తాగి గొడవలు కూడా పెట్టుకున్నారని.. ఇలా జరగకుండా చూడాలని సూచించారు. గతంలో కొంత మంది ట్రక్‌లపై కూర్చోని
నిమజ్జనం చూడటానికి వచ్చిన మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. గణేష్ నిమజ్జనం హిందువులకు పెద్ద పండుగ అని గుర్తు చేశారు. మద్యం సేవించి గణపతి ఊరేగింపులో పాల్గొనడం తప్పని చెప్పారు.
ఎవరైనా మద్యం సేవించి, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. క్రేన్లు కూడా రానున్నాయి. ఇప్పటికే నిమజ్జనం ప్రారంభమైంది. పలువురు గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట జోనల్ కమిషనర్లను ఆదేశించారు.












Click it and Unblock the Notifications