ములుగు జడ్పీ ఛైర్మన్ జగదీశ్ హఠాన్మరణం: కేసీఆర్ దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి
హైదరాబాద్: ఇటీవల కాలంలో గెండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, భారత్ రాష్ట్ర సమితి(BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీశ్ హఠాన్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ జగదీశ్ ప్రాణాలు కోల్పోయారు.
జగదీశ్ హఠాన్మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీశ్ చురుకైన పాత్రను పోషించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా జగదీశ్ చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

జగదీశ్ మృతి ఎంతో బాధ కలిగించిందని.. వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగదీశ్ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుసుమ జగదీష్ మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులతోపాటు.. పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తంచేశారు. జగదీశ్ మృతితో ఆయన కటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది ఇలావుండగా, రెండ్రోజుల క్రితం గుండెపోటుతో దుండిగల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మరణించారు. తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐ ప్రభాకర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధరించారు. ఎస్ఐ హఠాన్మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, ఇటీవల కాలంలో చాలా మంది యువకులు కూడా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆహారపు అలవాట్లు, సమయ పాలన సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటూ తగిన విశ్రాంతి, వ్యాయామం రెగ్యూలర్‌గా కొనసాగిస్తే గుండెపోటును నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications