పెరగనున్న నెహ్రూ జూ పార్క్ టికెట్ ధరలు
హైదరాబాద్: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన నెహ్రూ జూ పార్క్‌కు వెళ్లాలనుకునే సందర్శకులకు ప్రభుత్వం నుంచి స్వల్ప షాక్ తగలనుంది. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు జూ పార్క్‌కు రానున్న క్రమంలో టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జూపార్క్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాలక మండలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నెహ్రు జూపార్క్ టికెట్ ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకోగా పాలక మండలి కూడా అమోదం తెలిపింది. నెహ్రు జూ పార్కును కూడా అంతర్జాతీయ ప్రమాణలతో అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూ పార్కుల్లో సదుపాయాల్ని పెంచాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో సందర్శకులను ఆకర్షించడానికి అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా పెరిగిన జూ పార్క్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. పెద్దలు ఇకపై వీక్ డేస్‌లో జూ పార్క్ సందర్శనకు రూ.70 , సెలవు దినాల్లో రూ.80 చెల్లించాలి. అయితే పిల్లలు సాధారణ రోజుల్లో రూ.45 పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్‌లో రూ.55 చెల్లించాలి. ధరలు పెంచకముందు పెద్దలకు సాధారణంగా వర్కింగ్ రోజుల్లో రూ.60, వారాంతాల్లో, సెలవు దినాల్లో రూ.75 ఉండగా.. పిల్లల టిక్కెట్లు వారాంతపు రోజుల్లో రూ.40, సెలవు దినాల్లో రూ.50గా ఉండేవి.
అయితే అధిక ఆదాయం వచ్చేలా అటవీ శాఖ జూ పార్క్ ఎంట్రీ ధరను అంతటా పెంచాలని నిర్ణయించింది. అయితే కొత్త ధరలు ఎప్పుడు అమల్లోకి వస్తాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.60 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ జూ పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
హనుమకొండలోని కాకతీయ జూ పార్కు, మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి మినీ జూపార్కు, కరీంనగర్, పాల్వంచలలోని జింకల పార్కులు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కేబీఆర్, మృగవణి, హరిణి వనస్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృషి పెట్టింది. కాగా, వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవు కావడంతో జూ పార్క్‌లకు రద్దీ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications