గుడ్ న్యూస్.. 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి కేటీఆర్
గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని.. 57ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్ని పెండింగ్‌లో ఉన్న 4.50 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని జూన్ 8న సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటలో 4వ విడత పల్లె ప్రగతిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేళ్లలో చేసి చూపించామని కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాకే చెరువులు బాగు పడ్డాయని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 24 గంటల కరెంట్ వచ్చిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గల 12వేల 769 గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్ఫూర్తితో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ అందరికీ తెలిసిందని కేటీఆర్ అన్నారు. ఊరంతా మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. దేశంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ వస్తుందని కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications