తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాలూ తక్కువే: ఊరట దొరికినట్టేనా?
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. మరణాల సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గిపోవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలోనే 700ల వరకు కేసులు తగ్గాయి. ఇక ముందూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

తొలిసారిగా రికార్డుస్థాయిలో తగ్గిన కరోనా..
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,021 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుమంది మరణించారు. 2,214 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,13,084కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,87,342గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1228కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 24,514గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 20,036 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఒక్కరోజే 700 వరకు
అధికారులు ఆదివారం నాడు విడుదల చేసిన బులెటిన్‌తో పోల్చుకుంటే.. రోజువారీ కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. 1,717 కేసులు నమోదు కాగా.. 24 గంటలు తిరిగే సరికి ఆ సంఖ్య 1,021కి పడిపోయింది. 696 కేసులు తగ్గాయి. ఈ మధ్యకాలంలో కరోనా కేసుల్లో ఈ స్థాయిలో తగ్గుదల ఎప్పుడూ నమోదు కాలేదు. దీన్ని బట్టి- కరోనా వైరస్ వ్యాప్తి చెందడం క్రమంగా తగ్గుతోందని అంచనా వేస్తున్నారు అధికారులు. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. చాలాకాలం తరువాత 25 వేలకు దిగువగా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.

గ్రేటర్ సహా జిల్లాల్లో పరిమితంగా..
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-30, జగిత్యాల-31, జనగామ-12, జయశంకర్ భూపాలపల్లి-8, జోగుళాంబ గద్వాల-19, కామారెడ్డి-7, కరీంనగర్-67, ఖమ్మం-24, మహబూబ్ నగర్-26, మహబూబాబాద్-29, మంచిర్యాల-21, మెదక్-9, మేడ్చల్ మల్కాజ్‌గిరి-84, ములుగు-9, నాగర్ కర్నూలు-23, నల్లగొండ-46, నారాయణపేట్-1, నిర్మల్-6, నిజామాబాద్-26, పెద్దపల్లి-23, రాజన్న సిరిసిల్ల-15, రంగారెడ్డి-68, సంగారెడ్డి-44, సిద్ధిపేట్-41, సూర్యాపేట్-22, వికారాబాాద్-9, వనపర్తి-24, వరంగల్ రూరల్-16, వరంగల్ అర్బన్-27, యాదాద్రి భువనగిరి-20 కేసులు నమోదు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video

కరోనా నిర్ధారణ పరీక్షల్లోనూ..
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సగానికి పడిపోయాయి. ఇదివరకు రోజూ 55 వేలకు పైగా కరోనా టెస్టింగులను నిర్వహించే వారు. ఈ సారి 30,210 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 35,77,261కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 96,111 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications