ఇప్పుడంతా ఒక్కటయ్యాం! కేసీఆర్ సర్కారును తరిమికొట్టాలన్న రేవంత్, భారీ స్వాగతం
హైదరాబాద్: దళితులు, గిరిజనులపై దాడులు చేస్తుంటే ఊరుకునేది లేదిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని అన్నారు. ప్రాజెక్టులపై ప్రశ్నించిన నాగం జనార్ధన్ రెడ్డి, అతని వెంట వచ్చిన దళిత, గిరిజనుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారన్నారు.

సీఎం గద్దెపై కాంగ్రెస్ వ్యక్తేనంటూ రేవంత్
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రేవంత్ తెలిపారు. అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. దొరలకు బీఆర్ఎస్ ఉందని, పెట్టుబడిదారులకు బీజేపీ ఉందని.. అయితే, దళిత, గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు రేవంత్. రాష్ట్రంలో దళిత, గిరిజనులను బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు దళితుడు కాదు దరిద్రుడు సీఎం అయ్యారని విమర్శించారు.

ఒక్కటయ్యాం.. కేసీఆర్‌ను తరిమికొట్టాలన్న రేవంత్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌ను తరిమికొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని, మర్రి జనార్ధన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. టీపీసీసీ ఇంఛార్జీగా మాణిక్ రావ్ థాక్రే వచ్చిన తర్వాత పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని రేవంత్ చెప్పారు. ఇప్పుడు పార్టీలో నేతలమంతా కలిసి పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ దాడులను అడ్డుకుంటామన్న మాణిక్ రావ్ థాక్రే, భట్టి
మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో సామాన్యులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీఆర్ఎస్ దాడులకు పాల్పడితే కాంగ్రెస్ ప్రజల తరుపున పోరాడుతుందని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు అందరి మద్ధతు ఉండాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ దళిత, గిరిజనులపై దాడులు జరగడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. పోలీసులు తమ దోరణిని మార్చుకోవాలని హితవు పలికారు. కాగా, సభకు చేరుకున్న రేవంత్ రెడ్డి భారీ గజ మాలతో సత్కరించారు అభిమానులు. భారీ ఎత్తున ప్రజలు, అభిమానులు సభకు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications