మరోసారి బంగారు బోనం ఎత్తుతా.. అమ్మవారిని ఏం కోరానంటే: విజయశాంతి
హైదరాబాద్ పాత బస్తీ బోనాల పండుగతో శోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభోగంగా సాగుతున్నాయి. 113వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలు తీసుకుని తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులూ బోనాలు సమర్పించారు.
ఏడేళ్ల క్రితం తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని.. అమ్మవారు తెలంగాణ ఇచ్చినందున బంగారు బోనం ఎత్తానని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆదివారం రాములమ్మ లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకుని.. బోనం సమర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్నారని.. కరోనా తగ్గి అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే మళ్లీ బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందని.. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా అమ్మవారికి బోనం సమర్పించుకున్నానని విజయశాంతి చెప్పారు.

అంతకముందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. బోనాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోందని వివరించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు.
టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు ఉన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications