మనాలిలో ఉస్మానియా వైద్యులు సురక్షితం, కానీ ఆకలి కేకలు: హరీశ్ రావు ఆదేశాలు
హైదరాబాద్: విహార యాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా మెడికల్ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేకు అక్కడి అధికారులు ఫోన్ ద్వారా తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు సమాచారం ఇచ్చారు. మంత్రి ప్రత్యేక చొరవతో విద్యార్థులు ఆచూకీ తెలుసుకున్న అధికారులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల ఉస్మానియాలో పీజీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు.. డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో స్నేహితులందరూ సరదాగా గడిపేందుకు జూన్ 28న సిమ్లా, మనాలి ట్రిప్ వెళ్లినట్లు తెలిసింది. ఉస్మానియాలో పీజీ చేసిన డాక్టర్లు రోహిత్, కమల్, శ్రీనివాస్ మరో ఇద్దరు స్నేహితులు నిశాంత్, గోపితో కలిసి పర్యటనకు వెళ్లారు.

జులై 10న వీరంతా నగరానికి రావాల్సి ఉంది. అయితే, 8వ తేదీ నుంచి మనాలిలో ఉన్నారు. అయితే, భారీ వర్షాలు, వరదల ఉధృతితో అక్కడే చిక్కుకుపోయారు. తాము బస చేస్తున్న హోటల్ చుట్టుపక్కల ఇళ్లు కూలిపోతున్నాయని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్నేహితులకు ఫోన్లో తెలిపారు. ఆ తర్వాత ఐదుగురు విద్యార్థుల ఫోన్ స్విఛాఫ్ కావడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇతర మిత్రులు ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.. వారి ఆచూకీ తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారంరినీ సురక్షితంగా తీసుకురావాలని కోరారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని హిమాచల్‌ప్రదేశ్ అధికారులు మంత్రికి సమచారం అందించారు. ఇది ఇలావుంటే, తాము సురక్షితంగానే ఉన్నామన్న వైద్యులు.. తినడానికి ఏమాత్రం ఏమీ లేదని చెప్పారు. తమకు ఎలాంటి ఆహార పదార్థాలను అందించడం లేదని వాపోయారు. ఇక్కడి అధికారులు సరిగా పట్టించుకోవడం లేదన్నారు. తమను వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడ చిక్కుకున్న వైద్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోత వర్షాలతో 50 మందికిపైగా చనిపోగా, వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వంతెనలు, రహదారులు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications