గులాబీ గూటికి పాడి కౌశిక్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో చేరిక
అనుకున్నదే అయ్యింది. కాంగ్రెస్ మాజీనేత పాడి కౌశిక్ రెడ్డి గులాబీ దళంలో చేరబోతున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. రేపు (బుధవారం) టీఆర్ఎస్ పార్టీలో చేరతానని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

రేపు ముహూర్తం ఖరారు..
మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతానని ఆయన ప్రకటించారు. కొండాపూర్‌లోని నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని వివరించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయ్యానని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు.

సంక్షేమ మంత్ర..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టులతో రైతులు సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. రైతుబంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గం నుంచే అమలు చేశారని.. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం గొప్ప విషయమని తెలిపారు.

ఈటల దుర్వినియోగం..
సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు తాను అభివృద్ధి చెందేందుకు నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయం ప్రజలు కూడా గమనించారని పేర్కొన్నారు.

ఆడియో టేపుల కలకలం..
పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈటల రాజేందర్‌కు గట్టి పోటీని కూడా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. కౌశిక్ రెడ్డి పేరుతో ఆడియో టేపులు బయటకు వచ్చాయి. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరతానని.. టికెట్ కన్ఫామ్ అని చెప్పారు. తర్వాత రేవంత్, మాణిక్యం ఠాగూర్‌పై కూడా ఆరోపణలు చేశారు. దీంతో వివరణ అడగడంతో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి. కొద్దీరోజుల తర్వాత హస్తానికి బై చెప్పి.. కారు ఎక్కుతున్నారు.












Click it and Unblock the Notifications