Ganesh Immersion: నిమజ్జనం రోజు అలా చేస్తే కఠిన చర్యలు.. పోలీసుల హెచ్చరిక..
గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉంది. అదే రోజు మీలాద్ ఉన్ నబీ కూడా ఉంది. దీంతో పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు నిమజ్జనం రోజు 20 వేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని.. ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఊరేగింపు సాగే ప్రాంతం మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు.

గణేష్ విగ్రహం తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్లు ఉండకూడని పేర్కొన్నారు. గణేశ్ విగ్రహం తీసుకెళ్లే వాహనంలో మద్యం లేదా ఏ ఇతర మత్తు పదార్థాలు ఉండరాదని స్పష్టం చేశారు. గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం వచ్చే వారు కర్రలు, ఏ ఇతర ఆయుధాలు తీసుకురావొద్దని వివరించారు.
జెండాలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగుల పొడవు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్ పాదచారులపై వేయకూడదని తెలిపారు.
నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ, రెచ్చగొట్ట ప్రసంగాలు చేయకూడదని పోలీసులు చెప్పారు. అలాగే ఊరేగింపు సమయంలో బాణసంచా పేల్చరాదన్నారు. ప్రార్థన మందిరాల వద్ద విగ్రహం తీసుకెళ్లే వాహనాన్ని ఎక్కువ సేపు నిలపకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకూడదని పేర్కొన్నారు. రహదారిపై వెళ్లేటప్పుడు వాహనం ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications