రేపు హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. రేపు (సెప్టెంబర్ 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మర్గాలను ఎంచుకోగలరని అధికారులు సూచించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు (శనివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. సీటీవో జంక్షన్, ప్లాజా, టీవోలి, సికింద్రాబాద్ క్లబ్, బేగంపేట్, రసూల్‌పురా, కార్ఖానా, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్‌టీ జంక్షన్, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కావున.. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనాదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

రాష్ట్రపతి పర్యటన..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన వేళ అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications