హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ నా కల: సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్: అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌తో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు సీజేఐ హాజరయ్యారు. శుక్రవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణతోపాటు జడ్జీలు లావు నాగేశ్వరరావు, సుభాష్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారని, వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని కోరుకుంటారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అయితే, ఈ కేంద్రం ఏర్పాటుతో కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.

హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన స్వప్నమని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. దీని కోసం మూడు నెలల క్రితం ప్రతిపాదన చేశామని తెలిపారు. తన స్వప్నం సాకారానికి మూడు నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదన్నారు. తన ప్రతిపాదన సీఎం సత్వరమే స్పందించారన్నారు. ఈ కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. తన కల సాకారానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు సీజేఐ ఎన్వీ రమణ.
ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారని సీజేఐ తెలిపారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆర్బిట్రేషన్ ఏర్పాటు బాధ్యత జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని కోరుకుంటున్నట్లు సీజేఐ వెల్లడించారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టమని అన్నారు.












Click it and Unblock the Notifications