వన దేవతల గద్దెల వరకు బస్సులు.. 51 పాయింట్స్ నుంచి సర్వీసులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
వన దేవతలు సమ్మక్క సారాలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బంది కలుగకుండా సర్వీసులను నడుపుతుంది. మొత్తం 3,845 ఆర్టీసీ బస్సు సర్వీసులను తిప్పనుంది. రాష్ట్రంలోని 51 పాయంట్స్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 30 మంది ఉంటే ప్రత్యేక బస్సు పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 523 బస్సులను 1,250 ట్రిప్పులను ఇప్పటివరకు తిప్పినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కితే నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గరే దించుతామని చెప్పారు.
అమ్మవార్ల దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంప్, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాట్లు చేశామని వివరించారు. 7,400 మీటర్ల క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి మేడారం జాతర కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని వెల్లడించారు. మేడారం విత్ టీఎస్ఆర్టీసీ పేరుతో యాప్ ఇవాళ లాంచ్ చేశారు. ఇందులో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతోపాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు.

మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీవరకు జరగుతుంది. మేడారం జాతర సందర్భంగా గతేడాది 19,09,838 మందిని వివిధ గమ్యస్ధానాలకు చేర్చామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 523 బస్సులను 1,250 ట్రిప్పులను మేడారానికి పంపించినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి పెరిగే భక్తుల రద్దీని తట్టుకునేందుకు బస్సులు సిద్ధం చేశామని చెప్పారు.
మేడారం జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, స్నాన ఘట్టాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నాన్నారు. రోడ్డు తెలియక ఇబ్బందులు పడకుండా రహదారులకి ఇరువైపులా ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications