హైదరాబాద్‌లో వర్షం... రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన...
హైదరాబాద్‌లో మంగళవారం(ఏప్రిల్ 20) మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దుండిగల్,కాప్రా,సుచిత్ర,కొంపల్లి,కుత్బుల్లాపూర్,ఏఎస్ రావు నగర్,సైనిక్ పురి,నేరెడ్ మెట్,పహాడీ షరీఫ్,గాజుల రామారం,జీడిమెట్ల,జల్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల వర్షపు నీరు రోడ్ల పైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలతో విపరీతమైన ఉక్కపోతతో సతమతమవుతున్న నగర జనానికి ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.
రాబోయే మూడు రోజులు మూడు రోజుల్లో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రస్తుతం నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిందని తెలిపింది. ఈ ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలుచోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. కొన్నిచోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.

కాగా,గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం(ఏప్రిల్ 19) కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఫిలింనగర్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉపరితల ఆవర్తనంతో అకాల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
గత వారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. పంటలు చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చెడగొట్టు వానలు పంటను చేతికందనిస్తాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే పంట నష్టం వాటిల్లింది. మరికొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా యాదాద్రి,మెదక్ జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.












Click it and Unblock the Notifications