సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి ముఖ్య గమనిక
హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దుచేశారు. ఈ రద్దు శని, ఆదివారాలకు వర్తిస్తుంది. సోమవారం నుంచి యథావిధిగానే తిరుగుతాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో వీటిని రద్దు చేశారు. సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య తిరుగుతున్న సర్వీసులతోపాటు సిద్ధిపేట-సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న నాలుగు డెమూ రైళ్లు కూడా రద్దయ్యాయి. కొన్ని రెండురోజులు రద్దుకాగా, మరికొన్ని ఒక్కరోజుకు ఆపేయడంవల్ల మొత్తంగా 26 సర్వీసులు రద్దయ్యాయి.
అంతర్జాతీయస్థాయిలో పనులు
దేశవ్యాప్తంగా ప్రధానమైన రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరణ పనులను భారతీయ రైల్వే చేపట్టింది. ఈ జాబితాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఉంది. గతేడాది శంకుస్థాపన జరగ్గా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయస్థాయిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మూడేళ్లలో ఈ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి సంవత్సరం గడిచింది. మరో రెండు సంవత్సరాల్లో పనులు పూర్తికానున్నాయి.

మెట్రోకు వేర్వేరు మార్గాలు
కొత్త భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉంటాయి. ఉత్తరం వైపు మల్టీలెవల్ పార్కింగ్ ఉంటుంది. దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీని నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయబోతున్నారు. సికింద్రాబాద్ వెస్ట్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లకు చేరుకునేందుకు స్కైవేలను ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ కు చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద స్టేషన్లను ఎంపిక చేసి వాటిల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలా స్టేషన్లను అభివృద్ధి చేసిన తర్వాత అదానీ గ్రూప్ నకు అప్పగిస్తారంటూ కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications