కళాభవన్ ను సీజ్ చేసిన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌ను సంస్థ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉన్న అద్దె ఒప్పందాన్ని కూడా రద్దుచేసింది. సుచిరిండియా 2016లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది. కల్యాణ మండపం, కళా భవన్, మరో మూడు మినీ హాళ్లను లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం నెలకు రూ. 25.16 లక్షలను టీఎస్‌ఆర్టీసీకి చెల్లించాలి.
కొంతకాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించడంలేదు. రూ..6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను చెల్లించాలని అధికారులు పలుమార్లు సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారినుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కళాభవన్ ను అధికారులు సీజ్ చేశారు. సుచిరిండియాతో ఉన్న కాంట్రాక్టు ను రద్దుచేశారు. సంస్థ టీఎస్‌ఆర్టీసీకి అద్దె చెల్లించడం లేదు కాబట్టి.. కాంట్రాక్టును రద్దు చేసి ఆర్టీసీ కళా భవన్‌ను సీజ్ చేస్తున్నామని ప్రవేశ ద్వారం వద్ద ఒక పత్రాన్ని అధికారులు అతికించారు.

ప్రయాణికులను ఆకట్టుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ వినూత్న రీతుల్లో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి హైదరాబాద్ కు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు తిరుమలలో శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇదే తరహాలో ఐఆర్ సీటీసీ కూడా తిరుమల ప్యాకేజ్ ను అందుబాటులోకి తెచ్చింది. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో టికెట్లతోపాటు కొండపై ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తోంది. ఆర్టీసీ, రైల్వే.. రెండు సంస్థలు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంద్వారా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications