సిటీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ: కొత్తగా మరో రెండు టికెట్లు
హైదరాబాద్: ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC). వేసవి కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. టీ-24 టికెట్ ధర ఇది వరకు రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 90 చేసింది. ఇదే టికెట్ వృద్ధులకు రూ. 80కే అందించనుంది. ఈ ఆఫర్ గురించి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
సీనియర్ సిటిజన్లు వయస్సు ధృవీకరణ కోసం ఆధార్‌ను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం టీ-24 టికెట్ ఆర్టీసీ గతంలోనే తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ టికెట్ కొన్నవారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటలపాటు ఎక్కడ్నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మహిళలు, వృద్ధుల కోసం టీ-6 టికెట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రూ. 50 టికెట్ కొన్నవారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఎఫ్-24 అనే టికెట్ ను తెచ్చామని ఆయన తెలిపారు. రూ. 300 టికెట్ తీసుకుంటే 24 గంటలపాటు నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చని వివరించారు. హైదరాబాద్ నగర పరిధిలో తీసుకువచ్చిన టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లు కొని క్షేమంగా, సురక్షితంగా, సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.












Click it and Unblock the Notifications