నెల క్రితమే ఓ మాట చెప్పారు.. కానీ, అంతలోనే..: గద్దర్‌తో అనుబంధంపై సజ్జనార్
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ మరణ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవదేహానికి ఆయన సోమవారం నివాళులర్పించారు. గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు సజ్జనార్.
ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై ఓ పాట రాసి సంస్థకు అంకితం చేస్తానని గద్దర్ చెప్పారని సజ్జనార్ గుర్తు చేసుకున్నారు. ఉద్యోగుల కష్టాలపై పాట రాస్తానని చెప్పిన గద్దర్.. అంతలోనే మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రజా హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని అన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గుర్తు చేసుకున్నారు.

నెల రోజుల క్రితం ఆయన నన్ను కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు సజ్జనార్.
ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచిపోయారని కొనియాడారు.
''గద్దర్‌తో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారు' అని సజ్జనర్ గుర్తుచేసుకున్నారు.
ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్ భావించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారని అన్నారు. గద్దర్ పార్ధివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనర్, ఐపీఎస్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications