TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టు
టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన ఐదు డిమాండ్లు .. ఆర్టీసీ విలీనం, పీఆర్, ఐఆర్ సహా ఆరు డిమాండ్లపై యాజమాన్యం దాటవేయడంతో.. సమావేశం నుంచి యూనియన్ నేతలు బయటకొచ్చారు. చర్చలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. పూర్తి డిమాండ్లను అంగీకరిస్తేనే సమ్మె విరమస్తిమని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.

చర్చలు విఫలం
ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘ నేతలను తొలిసారి చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక నేతలతో చర్చలు జరిపింది. రెండు గుర్తింపు సంఘాలను ఆహ్వానించాలని హైకోర్టు సూచించడంతో.. ప్రభుత్వం నలుగురు నేతలకే ఆహ్వానం పంపించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజారెడ్డి, సీఎస్ రావు, వాసుదేవరావు మాత్రమే చర్చల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని అశ్వత్థామ తప్పుపట్టారు.

ఐదు డిమాండ్లపైనే పీఠముడి
ఆర్టీసీ విలీనం, ఐఆర్, పీఆర్ కాకుండా.. ఆర్థిక భారం లేని డిమాండ్లపై కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చించింది. సమ్మె నేపథ్యంలో ఇప్పటికే స్వచ్చందంగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు చర్చలకు సంబంధించి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం వీడియో తీస్తోంది. మరోవైపు చర్చలకు ఫోన్లు తీసుకురావద్దని జేఏసీ నేతలను స్పష్టంచేసింది. ఆర్టీసీ జేఏసీ నేతలు ఫోన్లు స్విచ్ఛాప్ చేసిన తర్వాత చర్చల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

కుదరని ఏకాభిప్రాయం
ఆర్టీసీ విలీనం, ఐఆర్, పీఆర్ అంశాలపైనే కార్మిక సంఘం నేతలు, యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి నెలకొంది. మిగతా 26 డిమాండ్లలో కొన్నింటీపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఐదు డిమాండ్లపై యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

ఆర్థికభారం లేని డిమాండ్లకు ఓకే..
ఆర్థిక భారం లేని డిమాండ్లను తీర్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ, రవాణాశాఖ కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. అయితే మిగతా ఐదు డిమాండ్లపై ఆర్టీసీ జేఏసీ పట్టుబట్టడంతో సమ్మె తర్వాత తొలిసారి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల పేరుతో యాజమాన్యం పిలిచి పాతపాటే పాడిందని అశ్వత్థామ విమర్శించారు.












Click it and Unblock the Notifications