తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఉరుములుమెరుపులు, ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షాలు.. మరోసారి వాతావరణాన్ని చల్లబరిచేందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా కురవనున్న వర్షాలతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తూర్పు తెలంగాణ జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం ఉదయం నుంచి పలు ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. కాగా, ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. చేతికందిన పంట అకాల వర్షంతో పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత ఆర్థిక భారం పెరిగిపోయిందని వాపోయారు.
పంట నీటిపాలు కావడంతో భారీ నష్టమే జరిగిందని చెప్పారు. వాలిపోయిన పంటను తీసేందుకు యంత్రాలు, కూలీలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి రావడం తమకు తలకు మించిన భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ పలువురు రైతులను పరామర్శించారు. ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications