నా భర్త ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు శాంతించింది: ఏపీలో రామరాజ్యం: వారసుడాయనే: లక్ష్మీపార్వతి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేదల కోసం కన్న కలలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తోన్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలని ఎన్టీఆర్ కోరుకున్నారో.. అచ్చంగా అలాంటి పరిపాలన ఏపీలో సాగుతోందని చెప్పారు. ఏ రామరాజ్య స్థాపన కోసం ఎన్టీ రామారావు నిర్విరామంగా కృషి చేశారో.. అటువంటి పరిపాలనను వైఎస్ జగన్ అందిస్తున్నారని అన్నారు.
పేద ప్రజల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ మధ్యాహ్నం ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను ఆమె సందర్శించారు. నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని లక్ష్మీ పార్వతి చెప్పారు. ఏ ఒక్క వర్గం కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో సరికొత్త పథకాలను వైఎస్ జగన్ అమలు చేస్తోన్నారని అన్నారు.

విద్య, వైద్యరంగాల్లో విప్లవాత్మక మార్పులకూ ఏపీ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ వంటి పథకాలతో వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ ప్రభుత్వ పనితీరుతో తన భర్త ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తోందని, ఆయన కోరుకున్న పరిపాలన అదేనని అన్నారు. సమాజంలో ఎవరి అండా లేకుండా, నిస్సహాయులుగా ఉంటోన్న వారి సంక్షేమానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో.. ఎలాంటి సిద్ధాంతాలను అనుసరించారో ఎన్టీ రామారావు ఆచరించి చూపించారని అన్నారు.
రెండు రూపాయలకే కిలోబియ్యం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిందని చెప్పారు. పక్కా ఇళ్ల నిర్మాణం, రైతు సంక్షేమం వంటివి ఎన్టీఆర్ హయాంలో చూశామని, ఇప్పుడు మళ్లీ ఆ తరహా పాలన ఏపీలో చూస్తున్నామని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 96 శాతం ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. కడుపులో పుట్టినంత మాత్రాన వారసులు కాలేరని లక్ష్మీపార్వతి పరోక్షంగా ఎన్టీఆర్ వారసులకు చురకలు అంటించారు.
తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి, దాన్ని సజీవంగా ఉంచిన వారే అసలు వారసులని చెప్పారు. ఎన్టీ రామారావు ఆశయాలను నెరవేరుస్తోన్న వైఎస్ జగనే.. ఆయనకు అసలు సిసలు వారసుడని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలన్నీ దేశం మొత్తం గుర్తింపు పొందాయని, పలు రాష్ట్రాలు ఏపీ వైపు చూపులు సారించాయని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని, ఇప్పటికీ అవి చెరిగిపోలేదని లక్ష్మీపార్వతి అన్నారు.
Recommended Video
నా భర్త ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు శాంతించింది: ఏపీలో రామరాజ్యం: వారసుడాయనే: లక్ష్మీపార్వతి#TDP #YSRCP #LakshmiParvathi #NTR pic.twitter.com/4DSgZSINvA
— oneindiatelugu (@oneindiatelugu) May 28, 2021