విరాట్ కోహ్లీ కేరీర్‌లో మరిచిపోలేని సెంచరీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లపై ధాటిగా విరుచుకుపడుతున్నారు.
ఈ మ్యాచ్- విరాట్ కోహ్లీకి మరిచిపోలేని కానుకను అందించింది. ఇది అతని 500వ మ్యాచ్ కావడం ఒక ఎత్తయితే.. ఇందులో సెంచరీ చేయడం మరో ఎత్తు. 87 పరుగుల తన ఓవర్ నైట్ స్కోర్‌తో ఇవ్వాళ క్రీజ్‌లోకి దిగిన విరాట్ కోహ్లీ.. తొలి గంటలోనే చిరస్మరణీయమైన మైలురాయిని అందుకున్నాడు. సెంచరీని బాదాడు.

500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మొట్టమొదటి క్రికెటర్ అతనొక్కడే. ఇప్పటివరకు ఈ ఘనతను అందుకున్న ప్లేయర్ మరొకరు లేరు. సెంచరీ చేసిన కొద్దిసేపటి తరువాత విరాట్ కోహ్లీ అయ్యాడు. 121 పరుగులు చేసి.. రనౌట్ అయ్యాడు. చివరి అయిదు ఇన్నింగ్‌లల్లో విరాట్ కోహ్లీ సాధించిన రెండో సెంచరీ ఇది.
తాను ఎదుర్కొన్న బంతిని స్క్వేర్ లెగ్ వైపు తరలించాడు విరాట్ కోహ్లీ. లేని పరుగు కోసం ప్రయత్నించాడు. క్రీజ్‌ను వదిలి రెండడుగులు ముందుకొచ్చాడు. అప్పటికే ఆలస్యమైంది. స్క్వేర్ లెగ్ వద్ద పొంచివున్న జోసెఫ్.. పాదరసంలా కదిలాడు. మెరుపు వేగంతో బంతిని వికెట్లకు గురిపెట్టి సంధించాడు. నేరుగా వికెట్లను గాల్లోకి లేపిందా బంతి.
క్రీజ్‌లో చేరుకోవడానికి కోహ్లీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జోసెఫ్ విసిరిన బంతి వికెట్లను గాల్లోకి లేపడంతో పెవిలియన్ వైపు వెనుదిరిగాడు. టెస్టుల్లో కోహ్లీ రనౌట్ కావడం ఇది మూడోసారి. కాగా- రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్‌లో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది భారత్.
ఓపెనర్ యశస్వి జైస్వాల్- 57, కేప్టెన్ రోహిత్ శర్మ- 80, విరాట్ కోహ్లీ- 121, శుభ్‌మన్ గిల్- 10, అజింక్య రహానె-10, రవీంద్ర జడేజా-61 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్-17, రవిచంద్రన్ అశ్విన్-2 పరుగులతో ఆడుతున్నారు. తొలి టెస్ట్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications