హైఓల్టేజ్ సిరీస్-వరల్డ్ కప్ కంటే ముందే రోహిత్ సేన కఠిన పరీక్ష: ప్రత్యక్ష ప్రసారం ఛానల్స్ ఇవే
ముంబై: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ను ఆడుతోంది. ఇప్పటికే సూపర్ 4 దశకు చేరుకుంది టీమిండియా. 10వ తేదీన తన దాయాది పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. సూపర్ 4లో మరోసారి ఫేస్ టు ఫేస్ తేల్చుకోబోతోన్నాయి.
దీని తరువాత 12వ తేదీన భారత జట్టు శ్రీలంకతో తలపడుతుంది. 14వ తేదీన శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 15వ తేదీన జరిగే చివరి మ్యాచ్‌లో భారత్- బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. సూపర్ 4 మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. అన్నీ డే/నైట్ మ్యాచ్‌లే.

దీని తరువాత టీమిండియా ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌కు సన్నద్ధమౌతుంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన.
ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఆసియా కప్ ముగిసిన తరువాత- వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఓ మినీ సిరీస్‌ను ఆడబోతోంది రోహిత్ సేన. మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీన్‌ను ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు రానుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నఆసీస్ టీమ్.. దాన్నిముగించుకుని నేరుగా భారత్‌కు చేరుకుంటుంది.

ఈ నెల 22వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. పంజాబ్ స్టేడియం దీనికి వేదిక. 24వ తేదీన రెండో మ్యాచ్ హోల్కర్ స్టేడియంలో జరుగనుంది. 27వ తేదీన మూడో వన్డేకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆదిథ్యాన్ని ఇవ్వనుంది. దీని తరువాత నేరుగా వరల్డ్ కప్ కోసం సన్నద్ధమౌతుంది టీమిండియా.
కాగా- ఈ మూడు వన్డేల సిరీస్ మొత్తం కూడా అయిదు ఛానెళ్లల్లో టెలికాస్ట్ కానున్నాయి. స్పోర్ట్స్ 18 (ఇంగ్లీష్), కలర్స్ సినీప్లెక్స్ (హిందీ), కలర్స్ కన్నడ, కలర్స్ తమిళం, కలర్స్ బంగ్లా ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీనితో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.
ఇప్పటికే వరల్డ్ కప్ 2023 కోసం టికెట్ల విక్రయాలను ప్రారంభించింది బీసీసీఐ. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బ్లాక్‌లో లక్షల రూపాయలను పెట్టి ఎగబడి మరీ కొంటోన్నారు క్రికెట్ ప్రేమికులు. అత్యధికంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు పట్ట పగ్గాల్లేకుండాపోతున్నాయి. బ్లాక్‌లో 50 లక్షల రూపాయల వరకు పలుకుతోంది ఒక్కో టికెట్ ధర.












Click it and Unblock the Notifications