వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అంబేడ్కర్

''ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది''. సరిగ్గా 101 సంవత్సరాల క్రితం, 31 జనవరి 1920నాడు ''మూక్‌నాయక్'' జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చి చూస్తే.. నేడు చాలా మార్పులు వచ్చాయి. అయితే, మారాల్సినంత మారలేదు.

మీడియాతో అంబేడ్కర్‌కు విడదీయరాని బంధాలు పెనవేసుకుని ఉండేవి. ఆయన సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించారు. సంపాదకుడిగా పనిచేశారు. ప్రత్యేక వ్యాసాలూ రాశారు. ఆ తర్వాత ఆయనే పత్రికల వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఎక్కువ మందికి చేరువైన, సామాజిక ఉద్యమాలను ఒంటి చేత్తో నడిపించిన అగ్ర నాయకుల్లో అంబేడ్కర్ ఒకరు.

కాంగ్రెస్ తరహాలో ఆయనకు ఆర్థిక, సామాజిక సాయం అందలేదు. అయితే, పేదల ఉద్యమంగా ఆయన దీన్ని నడిపించారు. భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుకబడిన బలహీన వర్గాలే ఆయన అనుచరులు.

దీంతో ఆయనకు ఆర్థికంగా ఎలాంటి సాయమూ అందేది కాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుండానే తన భుజాలపై అంబేడ్కర్ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చేది. మీడియా కవరేజీలోనూ ఇది స్పష్టంగా కనపడేది.

అంబేడ్కర్

అంతర్జాతీయ మీడియాలోనూ..

అంబేడ్కర్ కృషి దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేది. దేశీయ మీడియాలో ఆయన రాసిన కథనాలు, వ్యాసాల గురించి మనకు కొంతవరకు తెలుసు. అయితే, అంతర్జాతీయ మీడియాలో ఆయనకు సంబంధించిన కవరేజీ చాలా వరకు మరుగున పడిపోయింది.

ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలైన లండన్‌లోని ద టైమ్స్, బాల్టీమోర్ ఆఫ్రో అమెరికన్, ద నార్‌ఫోక్ జర్నల్‌లను అపట్లో నల్లజాతీయులు నడిపించేవారు. అంబేడ్కర్ అంటరానితనంపై నడిపించిన ఉద్యమాన్ని ఈ పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. గాంధీతో ఆయన విభేదాలపైనా వార్తలు ప్రచురించాయి.

రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర, పార్లమెంటులో ఆయన చర్చలు, నెహ్రూ ప్రభుత్వం నుంచి ఆయన రాజీనామా తదితర పరిణామాలను ప్రపంచం క్షుణ్నంగా గమనించింది. అంతర్జాతీయ పత్రికల్లో అంబేడ్కర్‌పై వచ్చిన కథనాలు, ఆయన రాసిన కథనాలపై ''అంబేడ్కర్ ఇన్ బ్లాక్ అమెరికా'' పేరుతో నేను ఓ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురించబోతున్నాను.

దేశీయంగానూ తన సామాజిక ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు అంబేడ్కర్ మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు. దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్ ''మూక్ నాయక్''ను ప్రారంభించారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం..

అణగారిన వర్గాల హక్కుల కోసం తన పత్రికలు, జర్నల్స్‌ సాయంతో అంబేడ్కర్ పోరాడేవారు. మూక్ నాయక్ తొలి 12 ఎడిషన్లకు ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డీడీ ఘోలప్ ఆ బాధ్యతలను తలకెత్తుకున్నారు.

అయితే 1923లో మూక్ నాయక్ మూతపడింది. ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్ విదేశాలకు వెళ్లడం, ప్రకటనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్ ఈ మ్యాగజైన్‌కు సాయం అందించారు. అంటరాని వారి స్వాతంత్ర్య ఉద్యమానికి మూక్ నాయక్ బాటలు వేసిందని అంబేడ్కర్ జర్నలిజంపై పరిశోధన చేస్తున్న గంగాధర్ పంత్‌వానే వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాల్లో ఈ జర్నల్ కొత్త ఊపిరులు నింపిందని ఆయన అన్నారు.

అంబేడ్కర్

బహిష్కృత్ భారత్ పేరుతో మరొకటి..

''మూక్ నాయక్'' అనంతరం ''బహిష్కృత్ భారత్'' పేరుతో 3, ఏప్రిల్ 1927లో మరో జర్నల్‌తో అంబేడ్కర్ ముందుకు వచ్చారు. మహద్ ఉద్యమంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మొదలుపెట్టారు.

ఇది 15, నంబరు 1929 వరకు నడిచింది. అయితే ఈ జర్నల్ కూడా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గాల్సి వచ్చింది. మూక్‌ నాయక్, బహిష్కృత్ భారత్‌ల ఒక్కో ఎడిషన్ ధర ఒకటిన్నర అణాలు మాత్రమే. వార్షిక సబ్‌స్క్రిప్షన్ అయితే పోస్టల్ చార్జీలతో కలిపి మూడు రూపాయలకే ఇచ్చేవారు.

ఇదే సమయంలో ''సమత(1928)'' జర్నల్ మొదలైంది. ఆ తర్వాత బహిష్కృత్ భారత్ పేరును ''జనతా''గా మార్చి 24 నవంబరు 1930న దీన్ని మళ్లీ పునఃప్రారంభించారు.

దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా జనతా రికార్డులకు ఎక్కింది. దాదాపు 25ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది. ఆ తర్వాత కాలంలో అంబేడ్కర్ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ''ప్రబుద్ధ భారత్''గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్ భారత్ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని, భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘకాలం పనిచేసిన పత్రిక ఇదేనని చెబుతారు.

అంబేడ్కర్

అందరినీ కలుపుకుంటూ..

ఈ కాలంలోనే ఉన్నత కులాల పాత్రికేయుల్ని తన మిషన్‌లో అంబేడ్కర్ కలుపుకుంటూ వెళ్లారు. అప్పట్లో చాలా పత్రికలను బ్రాహ్మణులు నడిపించేవారు. డీవీ నాయక్ (సమత, బ్రాహ్మణ్ బ్రాహ్మణేతర్), బీఆర్ కాద్రేకర్ (జనతా), జీఎన్ సహశ్రబుద్ధి (బహిష్కృత్ భారత్, జనతా) తదితరులు ఆయనతో పనిచేసిన వారిలో ఉన్నారు.

బీసీ కాంబ్లే, యశ్వంత్ అంబేడ్కర్ తదితర దళిత ఎడిటర్లు జనతాలో కీలకపాత్ర పోషించారు. అయితే, బహిష్కృత్ భారత్‌లో ఎడిటర్ల కొరత ఉండేది. ఒక్కోసారి ఒక ఎడిటరే 24-24 కాలమ్స్ రాయాల్సి వచ్చేది.

యశ్వంత్ అంబేడ్కర్, ముకుందరావ్ అంబేడ్కర్, డీటీ రూపవస్తే, శంకర్రావు కారాట్, బీఆర్ కాద్రేకర్‌ల సాయంతో ప్రబుద్ధ భారత్ ముందుకు నడిచింది.

అంబేడ్కర్

దళిత జర్నలిజం

అంబేడ్కర్‌కు ముందు దళితుల కోసం పనిచేసిన జర్నల్స్ చాలా తక్కువగా ఉండేవి. ఫూలే ప్రారంభించిన ''సత్యశోధక్ ఉద్యమం'' దళితుల కోసం పనిచేసింది. సత్యశోధక్ సమాజం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 1, 1877లో కృష్ణరావ్ భాలేకర్ ''దీన్ బంధు'' జర్నల్ ప్రారంభించారు.

దళితుల ఆలోచనలు, అభిప్రాయాలకు దీన్ బంధు స్థానం కల్పించేది. మధ్య మధ్యలో అంతరాయాలతో దాదాపు 100ఏళ్లు ఈ జర్నల్ నడిచింది.

తొలి దళిత జర్నలిస్టులుగా పేరొందిన వారిలో మహర్ వర్గానికి చెందిన గోపాల్ బాబా వాలాంగ్కర్ ఒకరు. ఆయన వ్యాసాలు, కథనాలు.. ''దీన్‌మిత్ర'', ''దీన్‌బంధు'', ''సూధ్రక్'' తదితర జర్నల్స్ కోసం ఆయన పనిచేశారు.

హిందూ ధర్మాలపై ఆయన విమర్శలను ''విటాల్ విధ్వంసక్'' పేరుతో ఓ పుస్తకం కూడా ప్రచురించారు. దీనిలో శంకరాచార్య సహా ప్రముఖ హిందూ నాయకులకు 26 ప్రశ్నలు సంధించారు.

అంబేడ్కర్

మరికొందరు కూడా..

మహర్ నాయకుడైన శివరామ్ జన్బా కాంబ్లే కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. తొలి దళిత దినపత్రిక ''సోమ్‌వాన్షీయ మిత్ర''ను ఆయన జులై 1, 1908లో ప్రారంభించారు.

దళితుల ఉద్యమ నాయకుల్లో కిసాన్ బాన్సోడే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు కార్మిక నాయకుడు ఎంప్రెస్ మిల్.. నాగ్‌పుర్‌లో స్వతంత్ర మీడియా సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే ''మజూర్ పత్రిక'' (1918-22), ''చోఖామేలా (1936)''లను ఆయన నడిపించారు.

1941లో రచయిత చోఖామేలా ఆత్మకథనూ ఆయన ప్రచురించారు.

''సోమ్‌వాన్షీయ మిత్ర''కు ముందు కిసాన్ బాన్సోడే.. ''మరాఠా దీన్‌బంధు'' (1901), ''అత్యంజ్ విలాప్'' (1906), ''మహారాంచ సూధ్రక్'' (1907)ల పేరుతో మూడు దిన పత్రికలను ఆయన నడిపించారు.

అయితే, ఈ పత్రికల కాపీలు ఏ ప్రాచీన పుస్తక భాండాగారాల్లోనూ లభించడంలేదు. అయితే అప్పటి పరిణామాలపై పరిశోధనలు చేసిన కొందరు.. ఈ పత్రికలను బాన్సోడే నడిపించారని తేల్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలను ఏకం చేయడమే ఈ పత్రికల లక్ష్యం.

అంబేడ్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పత్రికల్లో దాదాసాహెబ్ శిర్కే మొదలుపెట్టిన ''గరుడ్'' (1926), పీఎన్ రాజభోజ్ ప్రారంభించిన ''దళిత్ బంధు'' పతిత్‌పావండాస్ నడిపించిన పతిత్‌పావన్ (1932), ఎల్‌ఎన్ హరదాస్ ప్రారంభించిన మహారత్తా (1933), దళిత్ నినాద్ (1947) ఉన్నాయి.

కులాలపై గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీఎన్ బార్వే.. ''దళిత్ సేవక్''ను మొదలుపెట్టారు.

తొలినాళ్లలో అంబేడ్కర్ జర్నలిజంపై.. ''దళితాంచి వృతపత్రే'' పేరుతో 1962లో అప్పాసాహెబ్ రాన్‌పిసే ఓ పుస్తకాన్ని ప్రచురించారు.

మరోవైపు దళిత జర్నలిజంపై గంగాధర్ పంతవానే 1987లో ఓ పరిశోధక పత్రాన్ని ప్రచురించారు. ఆ తర్వాత అంబేడ్కర్‌ దళిత జర్నలిజంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

అంబేడ్కర్

కళాత్మకంగా...

అంబేడ్కర్ రచనలు చాలా కళాత్మకంగా ఉంటాయి. వీటిలో ఆయన గట్టి విమర్శలు చేసేవారు. మరోవైపు అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమీక్షించడంతోపాటు బడుగు వర్గాలపై జరిగే అకృత్యాలను ఎత్తిచూపేవారు.

ప్రభుత్వ విధానాలు, రాజకీయ పార్టీల వాదనలు, సామాజిక, రాజకీయ సంస్కరణలపై అంబేడ్కర్ సంపాదకీయాలూ రాసేవారు.

అంబేడ్కర్ ఆలోచనా విధానాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆయన కథనాలు, వ్యాసాలు మనకు చక్కటి అవకాశం కల్పిస్తాయి. ఆయన మంచి వ్యాసకర్త, ఆలోచనా పరుడు. ఆయన ప్రచురించిన జర్నల్స్‌లో దళిత ఉద్యమకారుల చిత్రాలు, దళిత కళాకారుల సృజనాత్మకత కనిపించేవి.

జూన్ 15, 1927లో ''బహిష్కృత్ భారత్''లో రాసిన ఓ కథనంలో బ్రాహ్మణులపై అంబేడ్కర్ ధ్వజమెత్తారు. ముంబయి ప్రాంతంలో చేపట్టిన ఓ సర్వేను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ప్రతి రెండు లక్షల మంది విద్యావంతుల్లో బ్రాహ్మణులు వెయ్యి మంది వరకు ఉంటే... అంటరాని వారి ప్రాతినిధ్యం సున్నా అని గణాంకాలను ఉటంకించారు.

దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది. దళితుల సామాజిక, రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే, అంబేడ్కర్ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు.

(హార్వర్డ్ కెనడీ స్కూల్‌లోని షోరెన్‌స్టీన్ సెంటర్ ఆన్ మీడియా, పాలిటిక్స్, పబ్లిక్ పాలసీలో సూరజ్ యెంగ్డే పరిశోధకుడు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ambedkar first Magazine Mook Nayak completes 100 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X