మృత్యు తీగ: పోలీసు తూటాకు 11మంది బలి
గౌహతి: ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపితే ఆ తూటాలు... హై ఓల్టేజ్ విద్యుత్తు ప్రసరిస్తున్న తీగెలకు తగిలి వారి మీద పడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఆందోళనకారులు పోలీసులు తూటాల నుంచి తప్పించుకున్నా.. తమపై మృత్యు రూపంలో విరుచుకుపడ్డ తీగెకు బలైపోయారు. విద్యుదాఘాతానికి మరో 20 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. కొడవళ్లు, కర్రలు చేతబట్టి ఆందోళన నిర్వహిస్తున్నవారు తొలుత పంగెరీ పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు.
అద్దాల తలుపుల్ని ధ్వంసం చేయడంతో ఘర్షణ మొదలైంది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో మూడు రోజుల క్రితం అరెస్టయిన అయిదుగురు వ్యక్తుల్ని తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఠాణాపై వారు దాడికి దిగడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

అవి విద్యుత్తు తీగెలకు తగిలి, ఆందోళనకారులపై పడ్డాయి. ఘటనా స్థలంలోనే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. తీవ్రంగా గాయపడిన 20మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, అస్సాం ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తక్షణమే స్పందించారు. వెంటనే అసోం ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌తో మాట్లాడి, పరిస్థితి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications