రోడ్డుపై బోల్తా కొట్టిన ఆర్టీసీ బస్: 11 మంది దుర్మరణం
Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. 29 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
గోండియా జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి బృందావన్ టోలా గ్రామం వద్ద మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. భండారా నుంచి దాదాపు 40 మంది ప్రయాణికులతో గోండియాకు బయలుదేరింది నంబర్ ఎంహెచ్ 09 1273 ఎంఎస్ ఆర్టీసీ బస్సు.

మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మార్గమధ్యలో దుగ్గిపార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ టోలా- దవ్వ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. రెండు బైక్‌లను ఓవర్ టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అదుపు తప్పిన బస్సు బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 29 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే గోండియా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. సహాయక చర్యల్లో పోలీసులకు సహకరించారు.
#WATCH | Gondia, Maharashtra | A State transport bus met with an accident after it lost control and overturned near Bindravana Tola village in the Gondia district. So far, 7 people have died. Around 30 people are injured and the injured have been shifted to Gondia District… pic.twitter.com/WZ8mrrv70D
— ANI (@ANI) November 29, 2024
మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. రోడ్డుకు అడ్డుగా పడటం వల్ల ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. క్రేన్ సహాయంతో రోడ్డుకు అడ్డుగా పడ్డ బస్సును తొలగించారు. గాయపడ్డ వారి హాహాకారాలు, అంబులెన్సుల మోతలతో సంఘటన స్థలం భీతావహంగా కనిపించింది.
ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం చేయించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications