Madhya Pradesh-Chhattisgarh Polling: మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో జోరుగా పోలింగ్..
మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకే ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యప్రదేశ్ లో ఒకే దశలో 230 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్ ఘడ్ లో 70 సీట్లకు ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతోంది.రెండు రాష్ట్రాల్లోను ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయాలని ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ నేతలు పిలుపునిచ్చారు.
230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... ఉదయం 9 గంటల వరకు మొత్తం 11.65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ఆయన ప్రత్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ తో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు మొత్త 2,533 మంది అభ్యర్థులు మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ లో 47 ఎస్టీ, 35 ఎస్సీలకు రిజర్వ్‌డ్‌తో సహా మొత్తం 230 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైందని అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుండగా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరీహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో పోలింగ్ శాతాలపైనా ఉత్కంఠ నెలకొంది.

అటు ఛత్తీస్ ఘడ్ లోనూ ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో రెండో, చివరి దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు సుమారుగా 5.71 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి దశ పోలింగ్ సందర్భంగా ఎదురైన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే స్ధానిక పరిస్ధితుల్ని బట్టి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications