చిరుతతో పోరాడిన 11ఏళ్ళ బుడతడు.. సాహస బాలుడు!
ధైర్యసాహసాలకు వయసుతో నిమిత్తం లేదు. ధైర్య సాహసాలతో ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి సమస్యలైనా ఇట్టే ఎదుర్కోవచ్చు. ఇక ఇదే విషయాన్ని నిరూపించాడు ఒక 11 ఏళ్ల బాలుడు. ప్రస్తుతం సాహస బాలుడిగా అందరూ చెప్పుకుంటున్న మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని 11 ఏళ్ల బాలుడు కువారా గురించి, అతడు చేసిన సాహసం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
11ఏళ్ళ బాలుడిపై చిరుత దాడి యత్నం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 11 సంవత్సరాల విద్యార్థి కువారా ఒక చిరుత దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అతనిపైన వెనుక నుంచి చిరుత దాడి చేసింది. చిరుత పంజా అతని బ్యాగ్ పైన పడగానే అప్రమత్తమైన కువారా తన స్నేహితుడితో కలిసి బిగ్గరగా కేకలు వేయడంతో పాటు, ఇద్దరు కలిసి చిరుత పైన రాళ్లదాడి చేశారు.

వీరోచితంగా చిరుతతో పోరాడిన బాలుడు
చిరుతపైన వీరోచితంగా పోరాడుతూనే, బిగ్గరగా అరుస్తూ జనాలను పిలిచే ప్రయత్నం చేశాడు. దీంతో వీరి అరుపులు విన్న స్థానికులు కర్రలు, రాళ్లతో అక్కడికి పరుగున వచ్చి చిరుతను తరిమే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చిరుత పులి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఇక ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
చిరుతను పట్టుకోవటానికి రంగంలోకి అటవీ అధికారులు
చిరుత 11ఏళ్ల బుడతడు పైన చేసిన దాడితో అతని చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చిరుత దాడి చేసిన సమయంలో అతని వెనుక భాగంలో స్కూల్ బ్యాగ్ ఉండడంవల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు అయింది. ఇక చిరుత పులి దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు చిరుతను గుర్తించడానికి కెమెరా ట్రాప్ లు, థర్మల్ డ్రోన్లు, బోన్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
చిరుతనే హడలగొట్టిన సాహస బాలుడు
చిరుత దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆ విద్యార్థిని అటవీశాఖ అధికారులు అభినందించారు. అంతేకాదు అటవీ జంతువుల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు.చిరుత సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పాఠశాలలను సాయంత్రం నాలుగు గంటల తర్వాత మూసివేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఇది విద్యార్థుల భద్రతకు దోహదం చేస్తుందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఘటనలో చిరుతతో విరోచితంగా పోరాడి 11 ఏళ్ల బాలుడు సాహస బాలుడుగా ప్రస్తుతం గుర్తింపు పొందాడు.












Click it and Unblock the Notifications