పరీక్షలు ఎగ్గొట్టేందుకు కిడ్నాప్ డ్రామా, 3 రాష్ట్రాల్లో గందరగోళం
తిరువనంతపురం: ఇరవై ఏళ్ల ఓ యువకుడు పరీక్షల నుంచి తప్పించుకునేందుకు సొంత కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఏకంగా మూడు రాష్ట్రాలలో గందరగోళం సృష్టించాడు. అతను కేరళకు చెందిన విద్యార్థి. పేరు జాన్ ఆంటోనీ. బిఏ చదువుతున్నాడు.
జనవరి 19 నుంచి సెమిస్టర్ పరీక్షలు ఉండగా అవి రాయకుండా తప్పించుకోవడానికి కిడ్నాప్ ప్లాన్ వేశాడు.జాన్ తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు. జాన్ చదువు నేపథ్యంలో స్నేహితులతో కలిసి కేరళలో ఉంటున్నాడు.
జనవరి పందొమ్మిదిన ఉదయం కాలేజీకి వెళ్లిన జాన్ తిరిగి గదికి రాలేదు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తిండి పెట్టకుండా కొడుతున్నారని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకి ఇంటర్నెట్ ఫోన్ సర్వీస్ ద్వారా సందేశం పంపించాడు.

తల్లిదండ్రులు కేరళకు వచ్చి కొడుకు అపహరణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపల అతని మిత్రులు, ఇతరులు అతని క్షేమం కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పొరుగు రాష్ట్రాల పోలీసులనూ అప్రమత్తం చేశారు.
డెబ్బై రెండు గంటల్లో చెన్నైలో జాన్ ఆచూకీ కనుక్కున్నారు. విచారణ చేపట్టగా పరీక్షల నుంచి తప్పించుకోడానికే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిసింది. తల్లిదండ్రులు జాన్‌ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో అతడిని కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత కోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications