ఢిల్లీలో ఆఫ్రికా జాతీయుడ్ని రాళ్లతో కొట్టి చంపారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. 23 ఏళ్ల ఆఫ్రికా జాతీయుడిని ఓ గుంపు రాళ్లతో కొట్టి చంపింది. ఈ సంఘటన ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు శనివారంనాడు చెప్పారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 11.45 గటలకు జరిగింది.
కాంగో దేశానికి చెందిన ఎంటి ఓలివియా ముగ్గురు వ్యక్తులతో వసంత్ కుంజ్‌లోని కిషన్‌గఢ్‌లో వాగ్వివాదానికి దిగాడు. ఈ గొడవలో భాగంగా ఓ వ్యక్తి ఒలివియాను కొట్టాడు. దాంతో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, అతన్ని ఆ ముగ్గురు వ్యక్తులు వేంటాడి పట్టుకున్నారు.

పట్టుకుని అతన్ని రాళ్లతో కొట్టారు. హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించడానికి సిసిటివీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓలివియాకు, ఆ వ్యక్తులకు మధ్య గొడవ ఎందుకు జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు అదికారులు చెప్పారు. దోపిడీ ప్రయత్నంలో భాగంగా జరిగిందా, జాతి వివక్షలో భాగంగా ఈ హత్య జరిగిందా అనేది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంఘటన గురించి కాంగో దౌత్య కార్యాలయానికి తెలియజేశారు.
ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఓలివియా విదేశీ భాషలను బోధిస్తున్నారు. ఆయన సౌత్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో నివసిస్తున్నాడు. అతను కిషన్‌గఢ్‌కు ఎందుకు వెళ్లాడనేది తెలియడం లేదు. మరో గ్రూప్ ఓలివియాను ఆ గ్రూప్ నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించింది. అయితే, అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.












Click it and Unblock the Notifications