కరోనా ఆంక్షల వలయంలో దేశం: లాక్‌డౌన్/కర్ఫ్యూలోనే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్, కర్ఫ్యూలతోపాటు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమలు చేస్తుండటం గమనార్హం.
Recommended Video

పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు..
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించారు. మెట్రో రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. హర్యానాలోనూ మే 17 వరకు పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లోవారాంతపు కర్ఫ్యూను అమలు చేశారు. ఇక తమిళనాడు, రాజస్థాన్, పుదుచ్చేరిల్లో సోమవారం నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. బీహార్‌లో మే 15 వరకూ కొనసాగుతుంది. ఒడిశాలో 14 రోజులపాటు లాక్‌డౌన్ మే 19 వరకు అమల్లో ఉంటుంది. నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా మే 14 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు..
పంజాబ్ రాష్ట్రంలో మే 15 వరకు వారాంతపు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలతోపాటు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇక ఛండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్ లను మే 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మహారాష్ట్రలో పూర్తి లాక్‌డౌన్ విధించనప్పటికీ.. ఏప్రిల్ 5న ప్రారంభించిన నిబంధనలను మే 15 వరకు పొడిగించారు. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ తరహాలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూని మే 17 వరకు పొడిగించారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ మే 13 వరకు పొడిగించారు. జమ్మూకాశ్మీర్‌లో మే 10 వరకు కరోనా కట్టడికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కర్ణాటకలో మే 24 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. సిక్కింలో మే 16 వరకు ఆంక్షలు విధించారు.

పలు రాష్ట్రాలో కర్ఫ్యూలు, ఆంక్షలు పొడిగింపు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ మే 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. ఇక్కడ అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్. గుజరాత్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. 36 నగరాల్లో పగటిపూట ఆంక్షలు మే 12 వరకు అమల్లో ఉండనున్నాయి. అస్సాంలో నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మే నెల మొత్తం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. మణిపూర్‌లో ఏడు జిల్లాల్లో మే 8-17 వరకు కర్ఫ్యూ. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను అమలు చేస్తోంది. హిమాచల్‌ప్రదేశ్ మే 7-16 వరకు లాక్‌డౌన్ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట ఆంక్షలను అమలు చేస్తోంది. పశ్చిమబెంగాల్‍లో గత వారం నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నారు. గోవా ప్రభుత్వం మే 9-24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.

గ్లోబల్ స్ట్రింగెన్సీ ఇండెక్స్‌లో పడిపోయిన ర్యాంక్
కాగా, ఏప్రిల్ 1న గ్లోబల్ స్ట్రింగెన్సీ ఇండెక్స్‌లో 51వ స్థానంలో ఉన్న భారత్.. ఏప్రిల్ 30 నాటికి 74వ స్థానంకు పడిపోయింది. కరోనా కట్టడి నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్న కారణంగా ఈ స్థానం చలనం కలిగింది. ఆంక్షలు, లాక్‌డౌన్ విధింపులను బట్టి ఈ ఇండెక్స్ నిర్ణయించబడుతుంది. గత ఏడాది మార్చి నెలలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా భారత్ ఈ ఇండెక్స్‌లో 100 స్కోర్ చేసిందని ఆక్స్‌ఫోర్డ్ కరోనావైరస్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఇండెక్స్ పేర్కొంది.












Click it and Unblock the Notifications