వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: ఆ రోజున ఏం జరిగింది? బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య యుద్ధానికి కారణమేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బొబ్బిలి యుద్ధం

265 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 1757, జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది.

ఒకవైపు వందల మంది సైన్యంతో బొబ్బిలి సంస్థానం, మరోవైపు వేలమంది సైన్యం, విజయనగరం సంస్థానంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం... ఒకరితో ఒకరు తలపడ్డ యుద్ధం అది.

ఆ యుద్ధం ఒక్కరోజులోనే ముగిసింది. కానీ రెండున్నర శతాబ్ధాలు గడిచినా ఇంకా ఆ యుద్ధ కథ తెలుగు నేలపై ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.

చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా ఒక్కరోజులో ముగిసిన బొబ్బిలి యుద్ధానికి మాత్రం ఎందుకంత ప్రత్యేక స్థానం?

ఆ యుద్ధం తర్వాత బొబ్బిలి, విజయనగర రాజ్యాల పరిస్థితి ఏంటి? రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన ఆ రెండు సంస్థానాల వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు?

షేర్...పెద్దపులి...బెబ్బులి...బొబ్బిలి...

బొబ్బిలి సంస్థానం 17వ శతాబ్దంలో ఆవిర్భవించింది. ప్రస్తుత బొబ్బిలికి, అంతకుముందు అనేక పేర్లు ఉండేవి. ఈ సంస్థాన స్థాపకులు పెదరాయుడు.

బొబ్బిలి యుద్ధం కారణంగా ఈ ప్రాంతం పేరు దాదాపుగా తెలుగు ప్రజలందరికి తెలుసునని ఆంధ్రా యూనివర్సిటీ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ తెలిపారు.

“1652లో మొఘలులు కళింగదేశంపై దండెత్తారు. మొఘల్ బాదుషాల తరపున సేనాని షేర్ మహమ్మద్ ఖాన్ ఈ దండయాత్ర చేశారు.షేర్ ఖాన్ ఆనాటి చికాకోలు (శ్రీకాకుళం) నవాబుగా ఉండేవారు.

ఈ షేర్‌ఖాన్ కళింగ సీమపై దాడి చేసినప్పుడు ఆయనకు వెంకటగిరి సంస్థానానికి చెందిన పెదరాయుడు సహాయం చేశారు. ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించడంతో, అందుకు సహకరించిన పెదరాయుడికి మొఘలులు రాజాం ఎస్టేటును షేర్ ఖాన్ ద్వారా బహుమతిగా ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.

ఆ తర్వాత ఈ ఎస్టేట్‌లో పెదరాయుడు షేర్ ఖాన్ పేరిట కోటను నిర్మించి దానికి పెదపులి అని పేరు పెట్టుకున్నారు. అదే కాలక్రమంలో పెబ్బులి, బెబ్బులిగా, ప్రస్తుతం బొబ్బిలిగా స్థిరపడింది.

''బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగు వారందరికి గుర్తొచ్చేది బొబ్బిలి యుద్దమే. తెలుగు నేలపై ఎన్ని యుద్దాలు జరిగినా బొబ్బిలి యుద్ధానిది ప్రత్యేక స్థానం. దానికి యుద్ధం జరిగిన తీరు, స్త్రీల ఆత్మాహుతులు ఇలా అనేక కారణాలున్నాయి” అని ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

బొబ్బిలి యుద్ధం

సంస్థానాల మధ్య స్నేహాలు, విభేదాలు

1750ల వరకు బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు.

''ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం, అలాగే వివిధ వేడుకల్లో రెండు సంస్థానాల మధ్య జరిగిన కోడిపందేలు, కుస్తీ ప్రదర్శనలు..ఇవే ద్వేషాలకు కారణమై యుద్ధానికి దారితీశాయి’’అని రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

రాజ్యాల మధ్య నీళ్లు, భూమి వంటి సహజ వనరుల వివాదాల విషయంలో బొబ్బిలి రాజులను ఎదుర్కొవడం విజయనగరం రాజులకు సాధ్యపడేది కాదు.

కానీ, ఎప్పటికైనా బొబ్బిలి రాజులను గెలిచి ఆ సంస్థానాన్ని తమ సంస్థానంలో కలుపుకోవాలని విజయనగర రాజులకు బలమైన కోరిక ఉండేదని సూర్యనారాయణ అన్నారు.

బొబ్బిలి యుద్ధం

''1750 సమయంలో ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్ర వచ్చి, సంస్థానాలన్నింటికి కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపారు.

తామెవరికి సామంతులు కాదని, కప్పాలు కట్టబోమని బొబ్బిలి రాజులు తేల్చి చెప్తారు. ఇదే అదనుగా భావించి, ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం కప్పాలు తానే కడతానని ఫ్రెంచి జనరల్ బుస్సీకి చెప్పి విజయనగరం రాజు ఫ్రెంచ్ పాలకులకు దగ్గరయ్యారు’’ అని సూర్యనారాయణ వెల్లడించారు.

శిస్తు చెల్లించడం మానేసిన బొబ్బిలి సంస్థానాన్ని ఇబ్బందులు పెట్టేందుకు అప్పటికే ఉన్న బొబ్బిలి, విజయనగర రాజుల శత్రుత్వాన్ని బుస్సీ అవకాశంగా మార్చుకున్నారు.

పెద విజయరామరాజు అండతో బుస్సీ ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపై దాడికి ఆజ్ఞాపించారు.

బొబ్బిలి యుద్ధం

1757 జనవరి 24న తెల్లవారు జామున..

బొబ్బిలి యుద్ధం రోజున ఏం జరిగిందో ఆ సంస్థాన వారసులైన రాజా వెంకట శ్వేతాచలపతి కుమారుడు కృష్ణ రంగారావు అలియాస్ బేబినాయన బీబీసీకి వివరించారు.

తనకు తమ వంశీయులు చెప్పడం ద్వారా ఈ విషయాలు తెలిశాయని చెప్పారు. ఈ కథను తన చిన్నతనం నుంచి అనేక కథల రూపంలో, తమ ఇంట్లో చర్చల రూపంలో వింటూనే ఉన్నానని తెలిపారు.

“ఆ రోజున బొబ్బిలి కోటవైపు విజయనగరం, ఫ్రెంచి సైన్యం కలిసి వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు తన సైన్యాన్ని సిద్ధం చేశారు. రాజాం వద్ద కాపు కాసి...అటుగా వస్తున్న విజయనగరం, ఫ్రెంచి సంయుక్త సైన్యాన్ని ఎదుర్కొనేందుకు బొబ్బిలి సైన్యాధ్యక్షుడు, తన బావమరిదైన తాండ్ర పాపారాయుడిని పంపారు.

కానీ, బొబ్బిలి శత్రుసైన్యాలు రాజాం మీదుగా కాకుండా అడవి మార్గం ద్వారా వచ్చాయి. ఆ విషయం పాపారాయుడికి తెలియక రాజాంలోనే ఉండిపోయారు.

దాంతో బొబ్బిలి కోటవైపు విజయనగరం, ఫ్రెంచి సైన్యాలు రావడంతో తానే యుద్ధరంగంలోకి స్వయంగా దిగాలని బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు నిర్ణయించుకున్నారు’’ అని బేబీనాయన తన పూర్వీకులు చెప్పిన చరిత్రను వివరించారు.

తాండ్ర పాపారాయుడికి కబురు పంపేందుకు వెళ్లిన వేగులను విజయనగరం సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి ఆ కబురు చేరలేదు. మరోవైపు విజయనగరం రాజులు, ఫ్రెంచి సైన్యం 1757 జనవరి 24న తెలవారుతుండగానే బొబ్బిలి చేరుకుని దండయాత్ర ప్రారంభించారు.

''బొబ్బిలి కోటను లక్ష్యంగా చేసుకుని ఫ్రెంచి ఫిరంగులు పేలాయి. వందల సంఖ్యలోనే సైన్యం ఉన్నా బొబ్బిలి సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఫ్రెంచి సైన్యం కోటలోపలికి వెళ్లలేకపోయింది.

ఎట్టకేలకు ఫిరంగులతో కోటను పూర్తిగా ధ్వంసం చేసి సాయంత్రం సమయానికి కోట లోపలకి ప్రవేశించారు. వారు లోపలకి ప్రవేశించే సరికి అక్కడ అన్నీ శవాలే కనిపించాయి’’అన్నారు బేబీ నాయన.

బొబ్బిలి యుద్ధం

'మందుపాతరల మధ్యలో పిల్లలు, స్త్రీలు’

“యుద్ధం జరుగుతున్నంత సేపు బొబ్బిలి కోటే లక్ష్యంగా ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. తక్కువ సైన్యం ఉన్న బొబ్బిలి సంస్థానం...వేలాదిమంది ఉన్న విజయనగరం, ఫ్రెంచి సైన్యంతో ఎలా పోరాడగలదనే విషయంపై తన ముఖ్యసేనానులను, అనుచరులను సమావేశపరిచారు. వారు అందించిన సమచారం ప్రకారం ఓటమి తప్పేటట్లు లేదని నిర్థరణకు వచ్చారు.

తమ సంస్థానపు స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించి కోట ప్రాంగణంలో ఉన్న తమ నివాసాలకు నిప్పుపెట్టడమే కాకుండా...మందు పాతరల మధ్య పిల్లలను, స్త్రీలను నిలబెట్టి పేల్చేశారు బొబ్బిలి సైనికులు. దాంతో కోటలో పిల్లలు, స్త్రీలు ఏ ఒక్కరు ప్రాణాలతో మిగల్లేదు’’ అన్నారు బేబీ నాయన.

బొబ్బిలి రాజు తన కుమారుడిని చంపమని తన గురువుని ఆదేశించినా ఆయన ఆ పని చేయలేకపోవడంతో రంగారావు కుమారుడు ఒక్కరు మిగిలారు. ఫ్రెంచి సైన్యం చేతిలో బయట, ఫిరంగుల దెబ్బకి కోట లోపల, అగ్నికి ఆహుతై స్త్రీలు, పిల్లలు ఇలా అంతా మరణించాక ఫ్రెంచి సైన్యం కోట లోపలకి ప్రవేశించగలిగింది.

''అక్కడ మంటల్లో స్త్రీలు, పిల్లలు చనిపోయిన దృశ్యం చూసి లోపలకు ప్రవేశించిన శత్రుసైన్యం కూడా భయపడిందట. అంతటి భయంకరమైన యుద్ధం ఈ నేలపై జరిగింది. బొబ్బిలి యుద్ధం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే తాండ్ర పాపారాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే” అన్నారు బేబినాయన.

తాండ్ర పాపారాయుడు విగ్రహం

తాండ్ర పాపారాయుడి శపథం

బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య రాణీ మల్లమ్మ సోదరుడు తాండ్ర పాపారాయుడు. ఈయనది రాజాం. బొబ్బిలి సంస్థానానికి సైన్యాధ్యక్షుడైన పాపారాయుడు వీర పరాక్రమవంతుడిగా పేరు పొందారు.

విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు, ఫ్రెంచి జనరల్ బుస్సీ బొబ్బిలిపైకి దండెత్తిన సమాచారం.. రాజాంలో ఉండటంతో తాండ్ర పాపారాయుడికి చేరలేదు.

బొబ్బిలి కోటను నాశనం చేసిన విషయం తెలుసుకున్న తర్వాత దానికి కారణమైన వారిపై పగతీర్చుకుంటానని పాపారాయుడు శపథం చేశారు.

యుద్ధం ముగిసిన మూడవ రాత్రి, తాండ్రపాపారాయుడు సైన్యం కళ్లుగప్పి పెద విజయరామరాజు శిబిరంలో అత్యంత చాకచక్యంగా ప్రవేశించారని, నిద్రిస్తున్న విజయరామరాజును తన బాకుతో వరుసగా 30కి పైగా పొట్లు పొడిచి చంపారని బేబీ నాయన వివరించారు.

తాండ్ర పాపారాయుడు పెద విజయరామరాజును హత్య చేస్తున్న దృశ్యం పెయింటింగ్

''విజయరామరాజు అరుపులకి అక్కడున్న ఫ్రెంచి సైన్యం వచ్చి తాండ్ర పాపారాయుడిపై కాల్పులు జరిపింది. ఆ కాల్పులతో నేలకు కూలబడుతూ..."నా శపథం నెరవేరింది...ఇదిగో నా పగ తీరింది” అంటూ పెద విజయరామరాజు శవాన్ని చూపిస్తూ పాపారాయుడు కూడా ప్రాణాలు విడిచారట’’ అని బేబీ నాయన తెలిపారు.

''పెద విజయరామరాజును చంపిన తర్వాత తాండ్రపాపారాయుడు తనని తాను పొడుచుకుని ప్రాణాలు విడిచారని కొందరు చెప్తారు. తాండ్రపాపారాయుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి ఫ్రెంచి సేనాని బుస్సీ అక్కడ నుంచి ముందుగానే జారుకున్నారని అంటారు. అనంతరం కాలంలో బొబ్బిలి యుద్ధంలో మిగిలిన బొబ్బిలి రాజు రంగరావు కుమారుడికి బుస్సీ బొబ్బిలి రాజుగా పట్టాభిషేకం చేశారు” అని బేబినాయన బీబీసీతో చెప్పారు.

బొబ్బిలి యుద్ధం

కత్తులు, కార్లు, షూటింగులు

బొబ్బిలి యుద్ధం జరిగిన చోట, బొబ్బిలి కోట నేలమట్టమైన చోట యుద్ధ చిహ్నంగా భైరవసాగరం వద్ద స్మారక స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, దుస్తులు, తుపాకులు, పల్లకీ, సింహాసనాలతో బొబ్బిలి కోటలో మ్యూజియం ఏర్పాటు చేశారు.

బొబ్బిలి రాజులు వాడిన ఆనాటి కార్లను సైతం ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు బొబ్బిలి కోటకు నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు.

“బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలతో పాటు వంశపారంపర్యంగా బొబ్బిలి రాజులు రాజవంశీయులు వినియోగించిన ఆయుధాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. సాలర్ జంగ్ మ్యూజియంలో పని చేసిన వారిని తీసుకుని వచ్చి, వారి అభిప్రాయాలు తీసుకుని మరీ ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

బొబ్బిలి యుద్ధం అందరికి తెలుసు. ఈ మ్యూజియంకు వస్తే ఆ యుద్ధాన్ని స్వయంగా చూసినట్లే ఉంటుంది’’ అని మ్యూజియం గైడ్ విశ్వేశ్వరరావు తెలిపారు.

బొబ్బిలి యుద్ధంలో వాడిని ప్రతి చిన్న ఆయుధం కూడా ఇందులో ప్రదర్శనకు ఉందని, రాజవంశీకులు వినియోగించిన అరుదైన కార్లు కోట ప్రాంగణంలో ఉన్నాయని ఆయన వివరించారు.

''వీటిని చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. బొబ్బిలి కోటలో తరచూ సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి” అని గైడ్ విశ్వేశ్వరరావు తెలిపారు.

బొబ్బిలి యుద్ధం

'రాజుగారి చేతిలో ఓడిపోవడం గౌరవమే’

పగ, పౌరుషం అనగానే బొబ్బిలి యుద్ధం పేరే చెప్తారు చాలామంది. బొబ్బిలి, విజయనగరం సంస్థానాల మధ్య జరిగిన ఈ యుద్ధానికి ముందు, తర్వాత కూడా ఈ రెండు సంస్థానాల మధ్య విభేదాలు కొనసాగాయి.

అయితే ప్రస్తుతం మాత్రం ఇరు సంస్థానాలకు చెందిన వంశీకులు ప్రజాస్వామిక రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఇటీవలి కాలం వరకు వేర్వేరు పార్టీల్లో పని చేస్తూ రాజకీయ ప్రత్యర్థులుగానే కొనసాగారు. ప్రస్తుతం మాత్రం ఇరువంశాల వారసులు ఒకే రాజకీయ పార్టీ (టీడీపీ)లో కొనసాగుతున్నారు.

“సంస్థానాలపరంగా విభేదాలు ఎలా ఉన్నా...రెండు సంస్థానాల వారు కూడా స్వాతంత్ర్యానికి పూర్వం రాచరిక రాజకీయాల్లో, ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కీలక పాత్ర పోషించి, రెండు వంశాలు ప్రజాభిమానం పొందాయి.

బొబ్బిలి రాజు రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మూడుసార్లు మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, ఇప్పుడు కూడా అసెంబ్లీకి బొబ్బిలి రాజులు ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మా సోదరులు సుజయకృష్ణ రంగారావు మంత్రిగా పని చేశారు. నేను బొబ్బిలి మున్సిపాలిటికి చైర్మన్‌గా చేశాను.

2014 ఎన్నికల్లో నేను విజయనగరం ఎంపీ స్థానానికి అశోక్ గజపతిరాజు గారిపై పోటీ చేసి ఓడిపోయాను. అదే సమయంలో మా సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే, నేను ఓడిపోయినా కూడా ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న అశోక్ గజపతి గారి చేతుల్లో ఓడిపోయాననే అనుకుని...అది ఒక గౌరవంగా భావిస్తాను’’ అని బేబినాయన బీబీసీతో అన్నారు.

ప్రస్తుత బొబ్బిలి కోట గోడలకు అశోక్ గజపతి రాజు భారీ కటౌట్లు పెట్టి ఉన్నాయి. ఇలాగే రెండు వంశాల వారసులు కలిసి మెలిసి ఉన్నామని బేబినాయన అన్నారు.

బొబ్బిలి యుద్ధం

'స్నేహితులం...ఒకటే జిల్లా వాసులం’

''అప్పటి యూరోపియన్ పాలకుల వ్యూహాలకు ఇక్కడి సంస్థానాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేవి, అలాంటిదే బొబ్బిలి యుద్ధం కూడా’’ అని మాజీ ఎంపీ, విజయనగర సంస్థాన వారసులు అశోక్ గజపతిరాజు బీబీసీతో అన్నారు.

ఆదాయమిచ్చే భూములు, వ్యాపారానికి అనుకూలంగా ఉండే పోర్టులపై అధిపత్యం కోసం విదేశీయులు భారతదేశ సంస్థానాల మధ్య చిచ్చుపెట్టేవారని ఆయన చెప్పారు.

“చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చరిత్ర ఉండేది అందుకే. విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య విభేదాలు, యుద్ధాలు అన్నీ గతం. ప్రస్తుతం మేమంతా స్నేహితులం, ఒకే రాష్ట్రం, ఒకే జిల్లా వాసులం. ఒకే పార్టీలో ఉన్నాం. అంతా కలిసిమెలిసి పని చేసుకుంటున్నాం. తరాలు మారుతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి. రాజ్యాలు, రాజరికాలు ఇప్పుడు లేవు. నడవవు కూడా. ఇక రాజ్యాలే లేని చోట్ల శత్రుత్వానికి చోటే లేదు” అన్నారు అశోక్ గజపతిరాజు.

బొబ్బిలి యుద్ధం

బుర్రకథంటే బొబ్బిలి యుద్ధమే

ఎక్కడైనా బుర్రకథ వినిపిస్తే అది బొబ్బిలి యుద్ధం బుర్రకథే అన్నంతలా తెలుగు నేలపై బుర్రకథకి బొబ్బిలి యుద్ధానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది.

“బొబ్బిలి యుద్ధాన్ని బుర్రకథగా చెప్తూ విజయనగరం జిల్లాల్లో ఒకప్పుడు చాలా బుర్ర కథ బృందాలు ఉండేవి. ఇప్పుడు బుర్ర కథకు పెద్దగా ఆదరణ లేకపోయినా...బొబ్బిలి యుద్ధానికి మాత్రం ఇంకా కాస్త ఆదరణ కనిపిస్తుంటుంది.

బాలనాగమ్మ, కాంభోజరాజు, పల్నాటి వీర చరిత్ర వంటి బుర్రకథలున్నా కూడా పండక్కో, వేడుకకో ఎవరైనా బొబ్బిలి యుద్ధం బుర్రకథే అడుగుతారు. దీంతో ప్రస్తుతం బుర్రకథంటేనే బొబ్బిలి యుద్ధం అనేలా మరిపోయింది” అని విజయనగరానికి చెందిన బుర్రకథ కళాకారుడు అప్పలనాయుడు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
265 years since the Battle of Bobbili: What happened that day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X