వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30శాతం పన్ను.. బిట్‌కాయిన్ లీగల్ అయినట్లేనా? కేంద్ర బడ్టెజ్‌లో చెప్పిన 5 కీలక విశేషాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బిట్ కాయిన్

దేశంలో డిజిటల్ కరెన్సీని త్వరలోనే తీసుకొస్తామంటూ 2022-23 బడ్జెట్ సందర్భంగా పార్లమెంటులో ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్.

అంతే కాదు వర్చువల్ డిజిటల్ అసెట్స్, డిజిటల్ వాలెట్స్, ఇ-పాస్‌పోర్ట్స్...ఇలా భారత్‌ను మరింత డిజిటల్‌గా మార్చే అనేక చర్యలను ఆమె ప్రకటించారు. ఈ డిజిటల్ మంత్ర వల్ల ఆర్థిక లావాదేవీల్లో అనేక మార్పులు రానున్నాయి.

1. క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30శాతం పన్ను

బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతారామన్ చెప్పిన ప్రకారం ఇకపై క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్ అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏదైనా క్రిప్టో కరెన్సీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు. రెండు మూడు నెలల తరువాత మీరు పెట్టిన లక్ష రూపాయలు కాస్త రెండు లక్షలు అయింది. అంటే ఇక్కడ మీ లాభం లక్ష రూపాయలు. లక్షలో 30శాతం అంటే 30వేల రూపాయలు మీరు ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది.

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా వచ్చే లాభాలకు కూడా 30శాతం పన్ను వర్తిస్తుంది.

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో నష్టాలు వస్తే వాటిని వార్షిక ఆదాయంలో చూపించడానికి లేదు.

మీకు వ్యాపారంలో ఈ ఏడాది రూ.5లక్షలు ఆదాయం వచ్చింది. క్రిప్టో కరెన్సీలో లక్ష రూపాయలు నష్టం వచ్చింది. ఏడాది చివర్లో ఈ లక్ష రూపాయల నష్టాన్ని రూ.5 లక్షల నుంచి తీసివేయడానికి లేదు.

అలాగే క్రిప్టో కరెన్సీ లావాదేవీల మీద 1శాతం టీడీఎస్ కూడా విధిస్తారు. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ చూద్దాం... మీరు లక్ష రూపాయలు పెట్టి క్రిప్టో కరెన్సీ కొన్నారు కదా. ఆ లక్ష మీద మీరు 1శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే వెయ్యి రూపాయలను టీడీఎస్ రూపంలో ప్రభుత్వం జమ చేసుకుంటుంది. 99వేల రూపాయలు మాత్రమే క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు వెళ్తాయి.

ఏడాది చివర్లో ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటే అందులో నుంచి టీడీఎస్‌ కింద కట్టిన అమౌంట్‌ను తగ్గిస్తారు.

క్రిప్టో కరెన్సీకి సంబంధించి జరిగే లావాదేవీలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ ను ప్రభుత్వం తీసుకొస్తోంది.

క్రిప్టో కరెన్సీని బంధువులకో లేక స్నేహితులకో గిఫ్ట్‌గా ఇస్తే దానిపై కూడా ట్యాక్స్ ఉంటుంది. కాకపోతే గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కాకుండా గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి పన్ను కట్టాలి.

ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇచ్చే కొన్ని రకాల బహుమతులపై పన్ను మినహాయింపు ఉంది. కానీ క్రిప్టో కరెన్సీని ఈ జాబితాలోకి తీసుకురాలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు గిఫ్ట్‌గా ఇచ్చినా సరే దాని మీద పన్ను కట్టాల్సి ఉంటుంది.

2. భారత్‌లో క్రిప్టో కరెన్సీ లీగల్ అయినట్లేనా?

బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల మీద పన్ను వేయడం ద్వారా కొత్త తరం ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడి మార్గాలను గుర్తిస్తామనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపింది. క్రిప్టో కరెన్సీల గుర్తింపుపై భారత్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో దీన్నొక కీలక పరిణామంగా చూడొచ్చు.

ఎవరి నియంత్రణ లేని క్రిప్టో కరెన్సీల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని గతంలో ఆర్‌బీఐ నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2020లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది సుప్రీం కోర్టు.

మరి ఇప్పుడు క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే ఆదాయంపై ప్రభుత్వం పన్ను వేస్తోంది అంటే ఇకపై అవి చట్టబద్ధమేనా అనే ప్రశ్న వస్తోంది. కానీ బిట్‌కాయిన్ వంటి వాటిని వర్చువల్ డిజిటల్ అసెట్స్‌గా చూసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది తప్ప క్రిప్టో కరెన్సీలుగా గుర్తించేందుకు సిద్ధంగా లేదనేది నిపుణులు చెబుతున్న మాట.

పన్ను వేస్తున్నంత మాత్రాన క్రిప్టో కరెన్సీలు ఇంకా దేశంలో లీగల్ కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కూడా అన్నారు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీల మీద సంప్రదింపుల ప్రక్రియ జరుగుతోంది.

అందువల్ల వాటిని చట్టబద్ధంగా గుర్తిస్తారా లేదా అనేదానిపై ఇప్పుడే చెప్పలేనని బడ్జెట్ అనంతరం దూరదర్శన్‌తో మాట్లాడుతూ ఆమె అన్నారు.

సీతారామన్ చెబుతున్న ప్రకారం ఆర్‌బీఐ తీసుకొచ్చే డిజిటల్ కరెన్సీ అనేది టోకెన్ మనీ మాత్రమే. దాని విలువ బంగారం లేదా ఇతర ప్రభుత్వ ఆస్తుల మీద ఆధారపడి ఉంటుంది.

అంటే ఇప్పుడు మనం వాడుతున్న పేపర్ కరెన్సీ లేదా కాయిన్స్ పని చేస్తోంది ఇలాగే. వాటి అసలు విలువ బంగారం మీద ఆధారపడి ఉంటుంది. క్రిప్టో కరెన్సీలు ఇందుకు భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎలా రెగ్యులేట్ చేయాలి? ఎవరు నియంత్రించాలి? అనే దాని మీద సంప్రదింపులు జరుగుతున్నట్లు సీతారామన్ అన్నారు.

అయితే క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తున్నారు కాబట్టి వాటిపై పన్ను వేయడం ప్రభుత్వం హక్కు అని దూరదర్శన్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు.

3. వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏమిటి?

వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద పన్ను వేస్తామంటున్నారు కదా మరి వర్చువల్ అసెట్స్ అంటే ఏమిటి? మనం చేతితో తాకలేని వాటిని వర్చువల్ అసెట్స్ అంటారు. కరెన్సీ నోట్లను, కాయిన్స్‌ను మనం టచ్ చేయగలం.

కానీ బ్యాంక్ అకౌంట్‌లో ఉండే డబ్బును తాకలేం. వర్చువల్ అంటే ఇదే. ఇప్పుడు మనం చూస్తున్న బిట్ కాయిన్, ఇథేరియం, డాడ్జ్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలన్నీ వర్చువల్ అసెట్సే.

అలాగే నాన్-ఫంజిబుల్ టొకెన్స్ ...అంటే ఎన్‌ఎఫ్‌టీలను కూడా ఆస్తులుగా చూస్తారు. వీటికి భౌతిక రూపం అంటూ ఉండదు. బ్యాంకులోని డబ్బు కావాలంటే భౌతిక రూపంలో మన చేతికి వస్తుంది.

ఇక క్రిప్టో కరెన్సీలను సేఫ్‌గా ఉంచుకునేందుకు డిజిటల్ వాలెట్ ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ వాలెట్‌కు పాస్‌వర్డ్ కూడా ఉంటుంది. వాలెట్‌లోని క్రిప్టో కరెన్సీలను అమ్మడానికి లేదా కొనడానికి పాస్‌వర్డ్ అవసరమవుతుంది.

అలాగే ప్రతి డిజిటల్ వాలెట్‌కు ఒక అడ్రస్ ఉంటుంది. 40 నుంచి 50 క్యారెక్టర్లు ఉండే ఈ అడ్రస్‌లో అంకెలు, అక్షరాలు ఉంటాయి. డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి డిజిటల్ వాలెట్లు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి.

4. ఇ-వాలెట్స్‌లో ఉండే కరెన్సీకి డిజిటల్ రూపీకి తేడా ఏంటి?

భారత్ సొంత డిజిటల్ రూపీ తీసుకొస్తున్నట్లు బడ్జెటల్‌లో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. అంటే త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని తీసుకొస్తుంది.

ఇప్పుడు వాడుతున్న పేటిఎం వంటి ఇ-వాలెట్స్‌లో ఉంచే కరెన్సీకి డిజిటల్ రూపీకి తేడా ఏంటనే సందేహం రావచ్చు. అయితే డిజిటల్ కరెన్సీకి, ఇ-కరెన్సీకి తేడా ఉంది.

మన పర్సులో ఉండే డబ్బులకు డిజిటల్ రూపమే ఇ-వాలెట్స్‌లో ఉండే కరెన్సీ. వీటి లావాదేవీలకు తప్పనిసరిగా బ్యాంకులు కావాలి. పేటిఎం వంటి ఇ-వాలెట్స్‌కు మనకు, బ్యాంకుకు మధ్య మధ్యవర్తిగా ఉంటాయి.

కానీ డిజిటల్ కరెన్సీలో ఇలా మధ్యవర్తి అంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఎలా అయితే నగదుతో లావాదేవీలు చేస్తున్నామో అలాగే డిజిటల్ కరెన్సీతో కూడా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.

బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది కాబట్టి డిజిటల్ మనీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే డిజిటల్ రూపీ కూడా మనం ఇప్పుడు వాడుతున్న కరెన్సీలాగానే చలామణీ అవుతుంది.

5. డిజిటల్ రూపీకి, క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి?

బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీని పరిమిత సంఖ్యలోనే మైనింగ్ చేయగలరు. ఉదాహరణకు 2 కోట్లకు మించి బిట్‌కాయిన్లను మైనింగ్ చేయలేరు.

అంటే పరిమిత సంఖ్యలోనే ఉంటాయి కాబట్టి డిమాండ్‌ను బట్టి బిట్‌కాయిన్ విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.

అయిదేళ్ల కిందట ఒక బిట్‌కాయిన్ విలువ 22 వేలుగా ఉండేది. నేడు అది సుమారు 30 లక్షల రూపాయలుగా ఉంది. చాలా వరకు క్రిప్టో కరెన్సీలన్నీ ఇలాగే ఉంటాయి. పరిమిత సంఖ్యలోనే ఉంటాయి కాబట్టి వాటి విలువ మారుతూ ఉంటుంది.

కానీ డిజిటల్ రూపీ విషయంలో పరిస్థితి ఇలా ఉండదు. డిజిటల్ రూపంలో ఉండే 10 రూపాయల విలువ 10 ఏళ్ల తరువాత కూడా 10 రూపాయలుగానే ఉంటుంది. లావాదేవీలు చేసే తీరును మాత్రమే డిజిటల్ రూపీ మారుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
30% tax on cryptocurrency income Is Bitcoin Legal? 5 key points mentioned in the Central Budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X