మహారాష్ట్ర సంక్షోభం- ఉద్ధవ్ తో భేటీకి 33 మంది ఎమ్మెల్యేల హాజరు- సంజయ్ రౌత్ వెల్లడి
శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గంటగంటకూ మలుపు తిరుగుతోంది. ముంబై నుంచి వెళ్లిపోయి గుజరాత్ లోని సూరత్ లో క్యాంపు వేసిన రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సీఎం ఉద్ధవ్ థాక్రే మిగిలిన ఎమ్మెల్యేలతో ఇవాళ భేటీ అయ్యారు. పార్టీలో సంక్షోభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలు సూరత్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాటిల్ తో వారు టచ్ లోకి వెళ్లారు. దీంతో వారిని పార్టీలో చేర్చుకుంటే మహారాష్ట్రలో అధికారం దక్కించుకోవడానికి వీలవుతుందా లేదా అనే దానిపై బీజేవీ లెక్కలువేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మిగతా వారు కూడా చేజారకుండా చూసేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే తన నివాసంలో చర్చలు నిర్వహించారు. సీఎంతో చర్చలకు 33 మంది శివసేన ఎమ్మెల్యేలు హాజరైనట్లు పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.

మరోవైపు శివసేన అధిష్టానంపై తిరుగుబాటు చేసి రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పంచన చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు. ఇప్పటికే ఏక్ నాథ్ షిండేను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తప్పించిన శివసేన.. ఆయనతో వెళ్లిన ఎమ్మెల్యేలకూ హెచ్చరికలు పంపుతోంది.
అయితే సూరత్ కు చర్చల కోసం వెళ్లిన శివసేన నేతల్ని రెబెల్స్ రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఉనికిపై సందేహాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇవాళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికలో బిజీగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న మూడో ప్రయత్నంగా శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటును అభివర్ణించారు.












Click it and Unblock the Notifications