యూపీ తొలిదశలో చురుగ్గా పోలింగ్-మధ్యాహ్నం 3 గంటలకు 48 శాతం ఓటింగ్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో ఉన్న 58 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతున్న ఈ పోరులో ఓటర్లు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం కల్లా పుంజుకుంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల నాటికి 48 శాతం ఓట్లు పోలయ్యాయి.
Recommended Video
పశ్చిమ యూపీ పరిధిలోకి వచ్చే 11 జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీల అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపబోతున్నాయి. తొలిదశలో ఇక్కడి ఓటర్లు ఎటు మొగ్గుతారన్న దానిపై మిగతా దశల్లో పోలింగ్ సాగే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో ప్రధాని మోడీ సహా దిగ్గజ బీజేపీ నేతలంతా ఇక్కడ మోహరించారు. పోలింగ్ జరగాల్సిన షహరాన్ పూర్ లో ఇవాళ ప్రధాన మోడీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే రైతుల నిరసనల ప్రభావం ఈ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నాయి.

మొదటి దశలో భాగంగా పశ్చిమ యూపీలోని జాట్‌ల ఆధిపత్య నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలో చురుకుగా పాల్గొన్నారు. దీంతో జాట్ పార్టీ అయిన ఆర్ఎల్డీ ఇక్కడ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అలాగే ఆ పార్టీ మిత్రపక్షం సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. అయితే వీరిద్దరినీ ఎదుర్కొంటూ పశ్చిమయూపీలో పాగా వేసేందుకు బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి-మార్చిలో ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.












Click it and Unblock the Notifications