భారీ ఎన్‌కౌంటర్- జవాన్లు వీరమరణం
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో అయిదుమంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కమాండర్ స్థాయి అధికారి ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని దేసా ఏరియాలో ఉగ్రవాదులు మకాం వేసినట్లు పక్కా సమాచారం అందడంతో సైనికులు, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఆపరేషన్ మొదలైంది.

ఉగ్రవాదులు నక్కివున్న ప్రాంతానికి చేరుకున్న వెంటనే కాల్పులు ఆరంభం అయ్యాయి. సుమారుగా 10 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పెద్ద సంఖ్యలో జవాన్లు, దోడా జిల్లా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో భాగస్వామ్యులయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు.
ఈ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ఆర్మీ అధికారులు నిర్ధారించారు. తమ వైపు నుంచి ప్రాణనష్టం సంభవించినట్లు తెలిపారు. ఓ కమాండర్ స్థాయి అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందినట్లు చెప్పారు. వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
రెండు వారాల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్‌లో సంభవించిన రెండో అతిపెద్ద దాడి ఘటన ఇది. కిందటి వారం కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రక్కులపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుమంది సైనికులు కన్నుమూశారు. మరో అయిదుమంది గాయపడ్డారు. జమ్మూ ప్రాంతంలో 32 నెలల్లో 48 మంది సైనికులు వీరమరణం పొందారు.












Click it and Unblock the Notifications