భారత ఆర్మీ క్యాంప్ పై దాడి: ట్రక్కులో..
అస్సాంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్ల క్యాంప్ పై భారీగా దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అదనపు భద్రత బలగాలు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు గానీ యునైటెడ్ లిబరల్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంపై (ఉల్ఫా)పై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
అస్సాాం తీన్ సుకియా జిల్లాలోని కోకాపత్థర్ లో ఈ వేకువ జామన ఈ ఘటన సంభవించింది. 2:30 నుండి 3:30 గంటల మధ్య జరిగి ఉండొచ్చని భావిస్తోన్నారు. హాత్‌మాన్ గ్రామం సమీపంలో ఉన్న అస్సాం రైఫిల్స్ ఆర్మీ, 19 గ్రెనేడియర్స్ యూనిట్ క్యాంప్ పై ఈ దాడి జరిగింది. వేర్పాటువాద సంస్థ ఉల్ఫా (ఇండిపెండెంట్), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (కే-కైవేఏ) తిరుగుబాటు గ్రూపులు సంయుక్తంగా దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తోన్నారు. ఆర్మీ క్యాంప్ పై తుపాకులతో కాల్పులు జరిపారు. గ్రెనేడ్లను విసిరారు. భీభత్సాన్ని సృష్టించారు.

ఈ కాల్పుల్లో నలుగురు అస్సాం రైఫిల్స్ సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. సుమారు 45 మంది సాయుధ వేర్పాటువాదులు ఈ దాడిని నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే విషయాన్ని ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
జులై 15వ తేదీన మయన్మార్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాల వైమానిక దాడుల్లో తమ గ్రూపునకు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు మరణించారని, మరో 19 మంది గాయపడ్డారని ఉల్ఫా (ఐ) గతంలో పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజా ఘటన చోటు చేసుకున్న వెంటనే సైన్యం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ దాడి కోసం ఉపయోగించిన ట్రక్కును అస్సాంతో సరిహద్దులు పంచుకుంటోన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని థెంగ్పాణీ ప్రాంతంలో వదిలివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. ఉల్ఫా (ఐ), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ పనిగా భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications