ఫెయిల్ చేస్తామని 49మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు
అకోలా: ఓ మహిళతోపాటు 49 మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటు చేసుకుంది.
జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రామావతార్ సింగ్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరు కీచక ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు ఆశా మిర్జాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఉపాయుధ్యాయుల ఆకృత్యాలు వెలుగుచూశాయి.
ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేయమని బెదిరింపులకు గురిచేసిన కెమెస్ట్రీ, బయోలజీ ఉపాధ్యాయులు తనపై చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత విద్యార్థిని మహిళా కమిషన్‌కు తెలిపింది. తమతో శరీరక సంబంధం ఏర్పర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది.

అంతకుముందు తనతో అసభ్యంగా మాట్లాడుతూ, తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి నిందిత ఉపాధ్యాయులపై విచారణ చేపట్టారు.
తనను ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కూడా తనపై నిందితులు ఒత్తడి తెచ్చారని బాధితురాలు తెలిపింది. కాగా, కీచక ఉపాధ్యాయుల విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ షిండే, సంజయ్ ఖడ్సే, మహిళా కమిషన్ సభ్యులు ఆశా మీర్జే నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications