అవును లంచాలిస్తున్నాం-తాజా సర్వేలో తేల్చేసిన 66 శాతం వ్యాపారులు..!
భారత్ లో లంచాల సంస్కృతి ఏ స్ధాయిలో ఉందో తెలియజేసే తాజా సర్వే నివేదిక ఒకటి బయటికి వచ్చింది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లోకల్ సర్కిల్స్ తాజాగా వ్యాపారాలపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. ఇందులో ప్రభుత్వానికి వివిధ వ్యాపారులు ఏ మేరకు లంచాలు ఇస్తున్నారో తేలింది. లంచం ద్వారా వారు ఏయే ప్రభుత్వ సేవలు పొందుతున్నారో కూడా ఇందులో వెల్లడైంది.
లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో ఏకంగా 66 శాతం మంది వ్యాపారులు తాము లంచం ఇచ్చి ప్రభుత్వ సేవలు పొందుతున్నట్లు తేల్చిచెప్పేశారు. ఇప్పటివరకూ వివిధ అనుమతులు, కొటేషన్లు, ఆర్డర్ల కోసం తాము ఇలా వివిధ ప్రభుత్వ శాఖలకు, అధికారులకు లంచాలు సమర్పించుకున్నట్లు వారు వెల్లడించారు. ఇందులో తూనికలు కొలతలు, ఆహారం, డ్రగ్ కంట్రోల్, జీఎస్టీ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఆరోగ్యశాఖలు ఉన్నట్లు వారు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా 18 వేల మంది వ్యాపారాలు పాల్గొన్న ఈ సర్వేలో 54 శాతం మంది తమను లంచం ఇవ్వక తప్పని పరిస్ధితులు కల్పిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాగే 46 శాతం మంది తాము స్వచ్చందంగా లంచాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ శాఖల అనుమతి ప్రక్రియను వేగవంతం చేయడానికి, లైసెన్స్ నకిలీ కాపీలను పొందడం లేదా ఆస్తి విషయాలతో ఏదైనా చేయాలనుకున్నప్పుడు లంచాలు తప్పనిసరిగా మారినట్లు సర్వే నివేదిక చెబుతోంది.
ఈ సర్వేలో పాల్గొన్న 66 శాతం వ్యాపారులు గత 12 నెలల్లో ఏదో రూపంలో ఎవరో ఒకరికి లంచం ఇచ్చినట్లు చెప్పారు. కేవలం 16 శాతం మాత్రం తాము ఎవరికీ లంచం ఇవ్వలేదని తెలిపారు. మరో 19 శాతం మంది తాము ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications