దేశంలో 67 శాతం మందికి కరోనావైరస్ యాంటీబాడీలు, మహమ్మారి ముప్పులోనే 40 కోట్ల మంది: సెరో సర్వే
న్యూఢిల్లీ: దేశ జనాభాలో ఇద్దరిలో ఒకరికి పిల్లలతో సహా కరోనావైరస్ ను ఎదుర్కోగల యాంటీబాడీలను కలిగివున్నారని మంగళవారం నాల్గవ జాతీయ సెరోసర్వే విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, మరో 40 కోట్ల మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉందని తెలిపింది.

దేశ జనాభాలో 67 శాతం మందికి కరోనా యాంటీబాడీలు
దేశ జనాభాలో 67 శాతం మందిలో కరోనా వైరస్ ఎదుర్కొనే యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అయినప్పటికీ మరో 40 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నాల్గవ జాతీయ సెరో సర్వేను భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్వహించింది.

పిల్లలనూ పరిగణలోకి తీసుకున్న సర్వే..
దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్-జులై మధ్యకాలంలో భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది.
దేశంలో 6 ఏళ్ల వయస్సుపైబడిన 67.6 శాతం మందిలో కరోనావైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 6-17 ఏళ్ల వయస్సున్నవారిలో 50 శాతం కరోనా ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలింది.

60 ఏళ్లకు పైబడినవారిలోనే అత్యధిక యాంటీబాడీలు..
45-60 ఏళ్ల వయస్సున్న వారిలో అత్యధికంగా 77.6 శాతం యాంటీబాడీలు ఉండగా, 60 ఏళ్లకు పైబడినవారిలో 76 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వేలో పిల్లలను రెండు గ్రూపులు విభజించారు. 6-9 ఏళ్లు, 10-17 ఏళ్లు. వీళ్లలో 6-9 ఏళ్ల వయస్సు వాళ్లలో 57.2 శాతం మందిలో, 10-17 వయసు వాళ్లలో 61.6 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తెలిపింది. ప్రతి జిల్లాలో 100 హెల్త్ కేర్ వర్కర్లు ఈ సర్వే కోసం పనిచేశారు. కాగా, పెద్దవారిలో 13 శాతం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని వెల్లడించింది. ఈ సెరోసర్వే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. పూర్తి భరోసాతో ఉండలేమని ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.












Click it and Unblock the Notifications