ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు, 8 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందగా, 27 మందికి గాయాలయ్యాయి. 35 మంది ప్రయాణికులతో బస్సు గంగోత్రి నుంచి వస్తుండగా గంగనమి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, వైద్య సిబ్బంది ప్రస్తుతం అక్కడే ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే ఓ హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేసి ఉంచామని తెలిపారు. కాగా, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి సహాయక బృందాలు.
మరోవైపు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ అతి బారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు వంద మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, రెండ్రోజుల క్రితం లడఖ్‌లోనూ ఇలాంటి ప్రమాద ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని కియారీ వద్ద శనివారం సాయంత్రం 4.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో ఐదు వాహనాలు ఉన్నాయని.. నది లోయలో పడిపోయిన ట్రక్కులో పది మంది జవాన్లు ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా దళాలు, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటకీ.. తీవ్రగాయాలతో 9 మంది జవాన్లు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. ఆర్మీ జవాన్ల మృతి బాధాకరమని, దేశానికి వారు చేసిన అసాధారణ సేవలను ఎన్నటికీ మరవబోమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications