గూగుల్ సీఈఓ పిచాయ్ తీసుకున్న 9 నిర్ణయాలివే
న్యూఢిల్లీ: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం డెవలపర్లు, ఔత్సాహికులు, మార్కెటింగ్ నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గూగుల్, యూట్యూబ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు.
సమావేశ అనంతరం, భారత సాంకేతిక గతిని మార్చేలా గూగుల్ తీసుకున్న 9 నిర్ణయాలను ఆయన వెల్లడించారు.
1. 2017 నాటికి 500 రైల్వే స్టేషన్లలో వైఫై సెంటర్లు ఏర్పాటు చేస్తామని, డిసెంబర్ 2016 నాటికి 100 స్టేషన్లలో ఈ సదుపాయం దగ్గరవుతుందని చెప్పారు.
2. బెంగుళూరు, హైదరాబాద్ క్యాంపస్‌లలోని గూగుల్ క్యాంపస్‌లలో నియామకాలు. ఇండియాలో తమ సేవలను రెట్టింపు స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా దక్షిణాది నగరం హైదరాబాద్‌లో అతిపెద్ద ఇంజనీరింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
3. భారత్‌లో సుమారు 2 మిలియన్ మంది డెవలపర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా అది పై మూడు అంశాలకూ చెందినదై ఉంటుంది. తక్కువ స్పీడు ఉన్న నెట్ కనెక్షన్లతోనూ మెరుగైన సేవలందించేందుకు చూస్తామన్నారు.

4. వచ్చే మూడేళ్లలో 3 లక్షల గ్రామాలకు చెందిన మహిళలకు ఇంటర్నెట్‌ను దగ్గర చేస్తామన్నారు. ఇందుకోసం ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నామని దానికి 'ఇంటర్నెట్ సాథీ' అని పేరు పెట్టామని వెల్లడించారు.
5. 11 భారతీయ భాషల్లో టైపింగ్‌ను మరింత సులభతరం చేసేలా 'ఇండిక్' కీబోర్డు విడుదల చేయనున్నామన్నారు.
6. వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ సెర్చ్‌లో ఇండియన్స్‌కు ఎంతో ప్రియమైన క్రికెట్ లైవ్ అప్‌డేట్స్ అందిస్తామన్నారు.
7. రెండేళ్ల క్రితం ప్రకటించిన ప్రాజెక్ట్ లూన్‌ను ఇండియాకు తీసుకువస్తామన్నారు. అతి తక్కువ ధరకు ఇంటర్నెట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీం అందిస్తుంది.

8. భారత్‌లోని ప్రతి పౌరుడికి 'ఇంటర్నెట్ యాక్సెస్' అయ్యేలా చూస్తామన్నారు. ఆపై సరైన సమయంలో సరైన సమాచారం వారికి దగ్గరయ్యేలా కృషి చేస్తామన్నారు.
9. వచ్చే సంవత్సరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న అమెరికన్ల కన్నా భారతీయుల సంఖ్య పెరగనుంది. దీంతో భారత్ గూగుల్‌కు హోం మార్కెట్ గా మారుస్తుంది.
చివరగా "ఈ దేశం నాకెంతో ఇచ్చింది. అందుకు తిరిగి గూగుల్ తరఫున నేను కూడా ఈ దేశానికి ఎంతో కొంత ఇస్తాను" అంటూ సుందర్ పిచాయ్ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications