దీపావళి నాడు కాళ్లు మొక్కి ఆపై కాల్పులు.. ఇద్దరు మృతి.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!
దేశమంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటున్న సమయంలో ఓ కుటుంబంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులలో ఒకరు సదరు వ్యక్తి కాళ్లకు మొక్కగా, మరొక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.
దీపావళి పండుగ వేళ విషాదం
ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటన వివరాల్లోకి వెళితే
నిన్న రాత్రి ఆకాశ్ శర్మ అనే వ్యక్తి తన కుమారుడు, మేనల్లుడుతో కలిసి ఇంటి బయట దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాలుస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి ముందు ఆగారు.

కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుని తుపాకీతో కాల్పులు..
వారిలో ఒక టీనేజర్ శర్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. పక్కనే నిలబడిన మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసుకొని శర్మ పైకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.దీంతో శర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇక అక్కడే ఉన్న మేనల్లుడు ఊహించని ఘటనతో షాక్ కు గురయ్యాడు. షాక్ నుంచి కోలుకొని శర్మ మేనల్లుడు పారిపోతున్న షూటర్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వారిని వెంబడించాడు. దీంతో నిందితుడు కాల్పులు జరిపారు.
సీసీ టీవీ ఫుటేజ్ చూసి షాక్ అయిన పోలీసులు
ఈ ఘటనలో శర్మ మేనల్లుడు మరణించాడు. తండ్రిని కాలుస్తున్న క్రమంలో అక్కడే ఉన్న శర్మ కుమారుడు కూడా బుల్లెట్లు తగలడంతో గాయాల పాలయ్యాడు. దీంతో అతడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శర్మని చంపింది ఎవరు? ఎందుకు ఇంత ఘాతుకానికి ఒడికట్టారు? అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కాళ్లు మొక్కి మంచిగా మాట్లాడి మరీ హతమార్చినట్టు సిసిటివి ఫుటేజ్ ద్వారా గుర్తించారు.
అప్పిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని హత్య
ఇక ఈ కేసులో ద్విచక్ర వాహనంపై వచ్చిన టీనేజర్ శర్మకు డబ్బులను అప్పుగా ఇచ్చాడని, శర్మ దానిని తిరిగి ఇవ్వలేదని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనికి సంబంధించి మృతులపై ఇదివరకే కేసు నమోదు అయిందని పేర్కొన్న పోలీసులు ఈ కేసులో సదరు టీనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు.
సుపారి తీసుకుని హత్య
అయితే శర్మని కాల్చి చంపిన షూటర్ సుపారి తీసుకుని ఆకాష్ శర్మను హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా దీపావళి పండుగనాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ మర్డర్ ఢిల్లీ వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.












Click it and Unblock the Notifications