ఓ తండ్రి కథ: పెళ్లి పేరుతో మోసం: బాధితురాలిని పెళ్లాడిన ప్రియుడి నాన్న!
తిరువనంతపురం: ప్రేమ పేరుతో తన కుమారుడి చేతిలో మోసపోయిన ఓ యువతిని పెళ్లాడిన ఓ తండ్రి కథ ఇది. కేరళలోని కొట్టాయం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలిని పెళ్లాడిన ఆ వ్యక్తి తన ఆస్తి మొత్తాన్ని ఆమె పేరు మీద బదలాయించారు. ఆయన పేరు షాజీ. జిల్లాలోని తిరునక్కారలో నివాసం ఉంటున్నారు.
ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆరేళ్ల కిందట ఆయన కుమారుడు తన క్లాస్‌మేట్‌ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెకు దగ్గరయ్యాడు. అప్పటికీ వాళ్లిద్దరూ మైనర్లే. ఈ ప్రేమ వివాహం తెలిసిన షాజీ వారికి పెళ్లి చేయడానికి అంగీకరించాడు. 18 ఏళ్లు నిండిన వెంటనే ఇద్దరికీ పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు.

ఈ లోగా వారిద్దరూ మేజర్ అయ్యాడు. ఈ లోగా- అతనికి మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమెను వెంటేసుకుని తిరగడం మొదలు పెట్టాడు. దీన్ని నిలదీసిన తన మొదటి ప్రియురాలిని దాదాపు మెడ పట్టి గెంటేసినంత పని చేశాడా ప్రబుద్ధుడు.
ఈ విషయం మొత్తం ఊరంతా పాకింది. ఫలితంగా- ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వలేదు తల్లిదండ్రులు. తమకు అసలు కుమార్తె పుట్టలేదని, పుట్టినా ఏనాడో చనిపోయిందని భావిస్తామని సినిమాటిక్ డైలాగులు వల్లించారు. మరి.. ఆ బాధితురాలి పరిస్థితేంటీ? ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ యువతి తన కుమారుడి చేతిలో మోసపోయిన విషయాన్ని గుర్తించాడు ఆ ప్రియుడి తండ్రి. ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడించాడు.

అయినా అతగాడు అంగీకరించలేదు. ఇక లాభం లేదనుకుని- బాధిత యువతిని తానే పెళ్లాడాడు షాజీ. వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరునక్కారలోని మహదేవర్ ఆలయంలో సంప్రదాయ బద్ధంగా బాధితురాలి మెడలో తాళి కట్టారు. అక్కడితో ఆగలేదు. ఆస్తి మొత్తాన్నీ ఆమె పేరు మీద బదలాయించేశారు.












Click it and Unblock the Notifications