కావేరీనీరు ఉండేది తాగడానికే: అంతే కాని ? మేం ఏం చెయ్యాలి ?
బెంగళూరు: కావేరీ నీరు ఉన్నది ప్రజలు తాగడానికి మాత్రమే అని కర్ణాటక శాసన సభ్యులు (అఖిలపక్షం) ముక్తకంఠంతో అన్నారు. శుక్రవారం శాసన సభ సమావేశంలో మొదట పఠాన్ కోట్, ఉరీలో జరిగిన ఉగ్రవాదుల దాడులను అఖిలపక్షం ఖండించింది.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యడం సాధ్యం కాదని అన్నారు.
అదే సమయంలో జేడీఎస్ పార్టీ సభ్యుడు వై.వీ.ఎస్ దత్తా ఆయనకు మద్దతు తెలిపారు. బెంగళూరు నగరంతో సహ పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రజలకు తాగు నీరు సరఫరా చెయ్యడానికి నాలుగు జలాశయాలు నిర్మించి కావేరీ నీరు నిల్వ చేస్తున్నమని వై.వీ.ఎస్. దత్తా చెప్పారు.
వర్షాలు పడకపోవడం వలన తాగు నీటి కష్టాలు ఎదురౌతున్నాయని అన్నారు. వర్షాలు లేకపోవడం వలన కర్ణాటకకు రూ. 40 వేల కోట్లు నష్టం వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈశ్వరప్ప అన్నారు.

నాలుగు జలాశయాలలో కేవలం కొన్ని టీఎంసీల నీరు మాత్రమే ఉందని గుర్తు చేశారు. తమిళనాడు రైతులకు అన్యాయం చెయ్యాలని తమకు లేదని, అయితే మా పరిస్థితి అర్థం చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి తమిళనాడు ప్రజలకు మనవి చేశారు.
తాగునీటిని రక్షించుకోవడానికి తాము ఏ పోరాటం చెయ్యడానికైనా సిద్దంగా ఉన్నామని కుమారస్వామి అన్నారు. కావేరి పరిరక్షణా కమిటీ దగ్గరకు వెళ్లాలని చెప్పిన సుప్రీం కోర్టు అదే సమయంలో తనకు ఇష్టం వచ్చినట్లు తీర్పు చెప్పిందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
కావేరీ జలాల కేసు విచారణ చేస్తున్న ఓ న్యాయమూర్తి జయలలితకు న్యాయవాదిగా పని చేశారని కుమారస్వామి ఆరోపించారు. తాము తాగు నీరును రక్షించుకోవడానికి తమిళనాడుకు నీరు వదలడం లేదని, అంతే కాని తాము న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించడం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. బోజన విరామం తరువాత శాసన సభ సమావేశాలు ప్రారంభం అవుతాయి.












Click it and Unblock the Notifications