టెంపోను ఢీ కొట్టిన స్లీపర్ బస్- 11 మంది దుర్మరణం
Rajasthan Road Accident: రాజస్థాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎనిమిది పిల్లలు ఉండటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్ జిల్లా బరౌలీ సమీపంలోని సునీపూర్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. వాళ్లను ఆస్మా, ఇర్ఫాన్ అలియాస్ బంటీ, సల్మాన్, సాకిర్, దానిష్, అజాన్, జరీనా, ఆషియానా, సుఖీ, సనిఫ్, జూలీగా గుర్తించారు. ధర్మేంద్ర, సాజిద్, ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని బారీ సిటీ కరీం కాలనీ, గుమ్మట్ మొహల్లాకు చెందిన నహ్ను, జహీర్ కుటుంబాలు శనివారం మధ్యాహ్నం తమ సమీప బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి టెంపోలో తమ స్వస్థలాలకు బయలుదేరారు. మార్గమధ్యలో సునీపూర్ వద్ద టెంపో ప్రమాదానికి గురైంది. జైపూర్ వైపు వెళ్తోన్న స్లీపర్ బస్సు అదుపుతప్పి వేగంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. రక్తసిక్తమైంది. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అతివేగమే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే బారీ సిటీ అదనపు కమిషనర్ కమల్ కుమార్ జింగిడ్, సబ్ కలెక్టర్ దుర్గా ప్రసాద్ మీనా, సీఐ మహేంద్రకుమార్ మీనా, శివ్ లహరి మీనా, సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో స్లీపర్ బస్ డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని అన్నారు. స్లీపర్ బస్సును సీజ్ చేసినట్లు చెప్పారు. భారతీయ న్యాయ సంహిత, మోటార్ వెహికల్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications