అతని పిల్లలకు తల్లి అయ్యే అవకాశం కోసం-స్పెర్మ్‌ను ప్రిజర్వ్ చేయాలంటూ-కోర్టులో భార్య పిటిషన్
గుజరాత్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించి ఓ విజ్ఞప్తి చేసింది. తన భర్త 'వీర్యం'('స్పెర్మ్) ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. తద్వారా, తన భర్తను కోల్పోయినా... భవిష్యత్తులో అతని పిల్లలకు తల్లిగా ఉండే అవకాశం కలిగించాలని వేడుకుంది. ఈ విషయంలో అత్త,మామలు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు ఆ మేరకు ఆస్పత్రి వర్గాలకు ఆదేశాలిచ్చింది.

అసలేం జరిగింది...
గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి ప్రస్తుతం చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి 29 ఏళ్ల భార్య ఉంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు లేరు. మంగళవారం(జులై 20) అతని పరిస్థితి విషమించడంతో... ఇంకా ఒకరోజుకు మించి అతను బతికే అవకాశం లేదని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఓవైపు భర్తను కోల్పోతున్న బాధ... మరోవైపు అతని ప్రతిరూపాన్నైనా చూసుకోవాలన్న ఆశ... ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె గుజరాత్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషన్‌లో ఏం పేర్కొన్నారు...
నీలాయ్ పటేల్ అనే న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆమె... తన భర్త స్పెర్మ్‌ను ప్రిజర్వ్ చేసేలా ఆస్పత్రి వర్గాలకు ఆదేశాలివ్వాలని కోరారు. మే 10న తన భర్త కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరాడని... ఇప్పుడాయన పరిస్థితి విషమింగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒకరోజుకు మించి బతకలేరని వైద్యులు నిర్దారించారన్నారు. భవిష్యత్తులో ఆయన పిల్లలకు తల్లిగా ఉండాలనే తన కోరిక నెరవేరాలంటే ఆయన స్పెర్మ్‌ను ప్రిజర్వ్ చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు.

కోర్టు గ్రీన్ సిగ్నల్...
ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఆ పేషెంట్ నుంచి స్పెర్మ్‌ను ప్రిజర్వ్ చేయాల్సిందిగా వడోదరాలో అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలకు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు కేవలం స్పెర్మ్ ప్రిజర్వ్ కోసమే ఆదేశాలిచ్చింది తప్పితే... దాని ద్వారా పిల్లలు పొందే ప్రక్రియకు ఇంకా అనుమతినివ్వలేదు. ఇదే పిటిషన్‌పై గురువారం(జులై 22) మరోసారి విచారణ జరిగే అవకాశం ఉంది.

ఆ బిల్లు ఆమోదం పొందే ఛాన్స్...
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న The Assisted Reproductive Technology (Regulation) Bill ప్రకారం ఎవరైనా వ్యక్తి నుంచి స్పెర్మ్ సేకరించాలంటే అతని అనుమతి తప్పనిసరి. వడోదరా ఆస్పత్రి యాజమాన్యం కూడా అతని అనుమతి లేకుండా స్పెర్మ్‌ను సేకరించడం కుదరదని చెప్పింది. దీంతో తన అత్త,మామలతో కలిసి ఆమె కోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు అందుకు తగిన అనుమతులు పొందింది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో The Assisted Reproductive Technology (Regulation) Bill బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications