కలిసే ఉందాం, కలిసే తాగుదామంటూ భార్య
చెన్నై: పీకలదాక మద్యం సేవించి ఇంటి విషయం మరిచిపోయి తిరుగుతున్న భర్తకు అతని భార్య బార్ లోనే చుక్కలు చూపించింది. ఆమె వేసిన డైలాగ్ కు బార్ లో ఉన్న మందు బాబులకు తలకెక్కిన కిక్ దిగిపోయింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెకు నచ్చ చెప్పారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేఆర్ జీ నగర్ లో జయకుమార్, విల్లి దంపతులు నివాసం ఉంటున్నారు. జయకుమార్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతను ప్రతి రోజు విపరీతంగా మద్యం సేవించేవాడు. రాత్రి ఎప్పుడుపడితే అప్పుడు ఇంటికి వెళుతున్నాడు. కొంత కాలం నుంచి ఇంటి ఖర్చులకు డబ్బు ఇవ్వకుండా జీతం మొత్తం ఖర్చు పెట్టి మద్యం సేవిస్తున్నాడు.

భర్తకు అనేక సార్లు నచ్చ చెప్పిన విల్లి చివరికి విసిగిపోయింది. ఎలాగైనా భర్తలో మార్పు తీసుకురావాలని అనుకుంది. మూడు రోజుల పాటు సాయంత్రం భర్త ఎక్కడికి వెళుతున్నాడు, ఏ బార్ లో మద్యం సేవిస్తున్నాడు అని విల్లి ఆరా తీసింది.
గుట్టు చప్పుడు కాకుండా భర్తను ఫాలో అయ్యింది. అతను నిత్యం వెళుతున్నటాస్మాక్ బార్ (తమిళనాడు అబ్కారీ శాఖ నిర్వహించే బార్) గుర్తించింది. బుధవారం భర్త కంటే ముందుగా ఆమె బార్ దగ్గరకు వెళ్లింది. బార్ సిబ్బంది, మందు బాబులు విల్లిని చూసి ఆశ్చర్యపోయారు.
చూడటానికి చక్కటి ఇల్లాలిగా ఉన్నావు, ఇక్కడికి ఎందకు వచ్చావు తల్లి, ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలని అక్కడ ఉన్న వారు ఆమెకు చెప్పారు. తన భర్త ఇక్కడికి వస్తాడని, ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తామని విల్లి చెప్పడంతో మందు బాబులు, బార్ సిబ్బంది షాక్ కు గురైనారు.
కొంత సేపటికి జయకుమార్ అక్కడికి వచ్చాడు. బార్ లో భార్యను చూసి ఉలిక్కిపడ్డాడు. ఎందుకు వచ్చావ్, ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఆమెను బెదిరించాడు. అయితే నీవు తాగే విస్కీ తనకు అర్డర్ ఇవ్వాలని, ఇద్దరూ కలిసి మద్యం సేవించి ఇంటికి వెళుదామని ఆమె చెప్పింది.
ఎంత మంది చెప్పినా ఆమె మాట వినలేదు. విషయం తెలుసుకున్న కేఆర్ జీనగర్ పోలీసులు బార్ దగ్గరకు వచ్చారు. జయకుమార్ కు వార్నింగ్ ఇచ్చి ఇక ముందు మద్యం సేవించనని అతని దగ్గర వాగ్దానం చేయించారు. తరువాత విల్లి శాంతించడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు.












Click it and Unblock the Notifications