కరోనా పేషెంట్‌పై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం... ఆస్పత్రి తరలిస్తుండగా ఘాతుకం...
కేరళలో దారుణం జరిగింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఓ యువతిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించే క్రమంలో డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆస్పత్రిలో ఆత్మహత్యకు యత్నించింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.

అసలేం జరిగింది...
కొట్టాయం జిల్లాకు చెందిన ఓ యువతి (19) ఇటీవల కరోనా బారినపడింది. దీంతో చికిత్స కోసం సెప్టెంబర్ 5న తన తల్లి(42)తో కలిసి కోజెన్‌చెరీ జిల్లా జనరల్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడ పడకలు ఖాళీగా లేకపోవడంతో.. వారిని పందలంలోని కోవిడ్ 19 సెంటర్‌కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ నౌఫల్(29)కు చెప్పారు. దీంతో ఇద్దరిని అంబులెన్సులో ఎక్కించుకుని డ్రైవర్ బయలుదేరాడు.

పేషెంట్‌పై లైంగిక దాడి
పేషెంట్‌ను పందలం కోవిడ్ 19 సెంటర్‌లో,ఆమె తల్లిని కోజెన్‌చెరీ ఆస్పత్రి వద్ద దింపాలి. నిజానికి అతను వెళ్లే దారిలో పందలం పట్టణమే మొదట వస్తుంది. కానీ కావాలనే అతను మొదట కోజెన్‌చెరీకి వెళ్లి అక్కడ ఆమె తల్లిని దింపేశాడు. అనంతరం అంబులెన్సులో ఆ యువతి ఒక్కరే ఉండటంతో... వాహనాన్ని ఓ నిర్మానుష్య ప్రాంతం వైపు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పందలం ఆస్పత్రిలో వదిలి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
Recommended Video

ఆత్మాహత్యాయత్నం... నిందితుడిపై కేసు నమోదు..
అప్పటినుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిన బాధితురాలు... ఆ మరుసటిరోజే ఐసోలేషన్ వార్డులోని బాత్ రూమ్‌లో ఆత్మహత్యకు యత్నించింది. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తమై తలుపులు బద్దలు కొట్టడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం ఆ యువతి డ్రైవర్ తనపై జరిపిన అఘాయిత్యం గురించి చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు,అంబులెన్స్ డ్రైవర్ నౌఫల్‌పై కేసు నమోదు చేశారు. అతనిపై గతంలోనూ ఓ హత్య కేసు నమోదైనట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ ఇది అమానవీయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications